తమిళనాడులోని ఓ ఎంఎల్ఏ పెళ్ళి సంచలనం సృష్టిస్తోంది. తమిళనాడులోని కళ్ళకురిచ్చి నియోజకవర్గం ఎంఎల్ఏ ప్రభు ప్రేమ వివాహం చేసుకున్నాడు. దళిత సామాజికవర్గానికి చెందిన ఎంఎల్ఏ బ్రాహ్మణ కులానికి చెందిన సౌందర్యను వివాహం చేసుకోవటం తర్వాత అది వివాదాస్పదం కావటం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. 36 సంవత్సరాల వయస్సున్న ఎంఎల్ఏ దేవాలయంలో ఓ పూజారి సంతానమైన 19 ఏళ్ళ కూతురును ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి ముందే ఎంఎల్ఏ ఇంటికి వెళ్ళిన పూజారి తన కూతురును వివాహం చేసుకోవటంపై తీవ్ర అభ్యంతరం చెప్పారు.
అయితే పూజారి అభ్యంతరాన్ని లెక్క చేయని ఎంఎల్ఏ సౌందర్యను తన తల్లి, దండ్రులు, దగ్గరి బందువుల సమక్షంలో తనింట్లోనే వివాహం చేసేసుకున్నాడు. సౌందర్య డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది. తాను అభ్యంతరం చెప్పినా వినకుండా ప్రేమ వివాహం చేసుకున్నారన్న కోపంతో పూజారి పెట్రోలు పోసుకుని ఎంఎల్ఏ ఇంటి ముందే ఆత్మహత్యకు ప్రయత్నం చేశారు. అసలే ఎంఎల్ఏ ప్రేమ పెళ్ళి, అందులోను కులాంతర వివాహం దానిపై అమ్మాయి తండ్రి, పూజారి ఆత్మహత్యాయత్నం… ఇక చెప్పేదేముంది సంచలనానికి.
ఇదే విషయం మొదటినుండి తమిళనాడులోని మెయిన్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో వార్తలు, కథనాలు, ఫొటోలతో సహా ఒకటే హోరెత్తిపోతోంది. ఆత్మహత్యాయత్నం చేసిన పూజారిని వెంటనే ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ ఆయన మాట్లాడుతూ కులాంతర వివాహం అని తాను అడ్డు చెప్పలేదని కాకపోతే ఎంఎల్ఏ వయస్సు 36 సంవత్సరాలన్నదే తన ప్రధాన అభ్యంతరంగా చెప్పారు. సరే ఏ విషయంలో ఎంత అభ్యంతరం ఉన్నా కూతురు ఇష్టపడి వివాహం చేసేసుకున్న తర్వాత తండ్రయినా ఇంకెవరైనా చేసేదేముంటుంది ? పైగా ఆమె మేజర్.