కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాతో ఏపీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ నేత కనుమూరి రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల తర్వాత.. తొలిసారి ఢిల్లీ వచ్చిన రఘురామ.. హోం మంత్రితో భేటీ కావడం సంచలనంగా మారింది. పైగా డిప్యూటీ స్పీకర్‌గా కూడా ఎన్నికైన తర్వాత ఆయన కలుసుకోవడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సుమారు 20 నిమిషాల పాటు రఘురామ హోం శాఖ మంత్రితో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఏం చర్చించారన్న విషయాలు ఆసక్తిగా మారాయి. గత వైసీపీ ప్రభుత్వంలో తనను అరె స్టు చేయడం, పోలీసులు నిర్బంధించి తనను కొట్టడం దీనిని వీడియో కాల్‌లో `పెద్దలకు` చూపించారన్న అభియోగాలు ఉన్న విషయం తెలిసిందే. తాజాగా కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. ఆ కేసును తిరిగి తోడుతున్నారు. ప్రధాన అభియోగాలు ఎదుర్కొంటున్న ఏ ఎస్పీ.. పాల్ కూడా ప్రస్తుతం లైన్‌లోకి వచ్చా రు. ఇక, కీలకమైన అధికారులు సహా రాజకీయ పెద్దలు మాత్రమే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీకి రావడం, కేంద్ర హోం మంత్రి షాతో రఘురామ భేటీ కావడం వంటివి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే.. పెద్దలపై కేసు బిగుస్తోందని, తనను ఎవరు కొట్టారో కాదు .. ఎవరు కొట్టించారో త్వరలోనే తేలుతుందని తాజాగా వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ `పెద్దలకు` ఎలాంటి మద్దతు లభించకుండా చేసే వ్యూహంలో భాగంగానే రఘురామ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రధానంగా ఇప్పటి వరకు ఢిల్లీ అండ చూసుకుని గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలు చెలరేగిపోయార న్న విమర్శలు వున్నాయి. అయితే.. ఇప్పుడు ఏపీలో సర్కారు మారడంతో ఢిల్లీ పెద్దల ఆలోచన కూడా మారుతుందని, ఆ నేపథ్యంలోనే తనకు న్యాయం జరుగుతుందని ఆర్ ఆర్ ఆర్ లెక్కలు వేసుకుంటు న్నారు. అందుకే ఏపీలో ఏఎస్పీ పాల్ విషయం తెరమీదికి రావడం, కోర్టు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన దరిమిలా.. రఘురామ ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది.