కేంద్రంలోని బీజేపీ పెద్దలు మహా ఆనందంగా పార్లమెంటుకు వచ్చారు. సోమవారం నుంచి ప్రారంభమైన.. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ప్రతిష్టాత్మకంగానే కాదు.. సంతోషంగానూ వారు భావించారు. దీనికి కారణం.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మహా ప్రభంజన విజయాన్ని నమోదు చేయడమే. మూడు దశాబ్దాల కాలంలో ఒక కూటమికి భారీ సంఖ్యలో సీట్లు కట్టబెట్టిన పరిస్థితి మహారాష్ట్రలో ఇదే తొలిసారి. బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 235 స్థానాల్లో అప్రతిహత విజయం నమోదు చేసుకుంది. ఇదేసమయంలో తమదే అధికారం అంటూ ఆది నుంచి ధీమా వ్యక్తం చేసిన కాంగ్రెస్ కూటమి కుప్పకూలింది.
దీంతో సహజంగానే కమల నాథులు నింగినంటే ఉత్సాహంతో.. అపరమిత ఆనందంతో పార్లమెంటుకు వచ్చారు. ఈ సంతోషాన్ని ప్రధాని మోడీ మీడియా ముందు కూడా పంచుకున్నారు. “ఈ సారి పార్లమెంటు సమావేశాలు ప్రత్యేకం.” అంటూ ప్రధాని చెప్పుకొచ్చారు. అందరూ సహకరించాలని యధావిధిగా చెప్పుకొచ్చారు. ఇక, ఇతర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా మిఠాయి డబ్బాలతో సభలోకి అడుగులు వేయడం గమనార్హం. వారి ఉద్దేశం మహా విజయాన్ని సభ్యులందరితోనూ పంచుకోవాలని. అదేసమయంలో కాంగ్రెస్ కూటమి మహా వికాస్ అఘాడీ నేతలను ఎద్దేవా చేయడం! మొత్తానికి సర్వశక్తులూ ఒడ్డి గెలుచుకున్న మహారాష్ట్ర విజయాన్ని పార్లమెంటులో తనివి తీరా ఆస్వాదించాలని వచ్చారు.
కానీ, ఇక్కడే కమల నాథులకు పెద్ద ఇబ్బంది ఎదురైంది. వారి మహా ఆనందాన్ని, ఉత్సాహాన్ని సమూలంగా ఉత్తరప్రదేశ్ మింగే సింది. ఉత్తర ప్రదేశ్‌లోని సంభల జిల్లాలో చోటు చేసుకున్న కాల్పులు, అల్లర్ల ఘటనలో సోమవారం ఉదయానికి 50 మందికి పైగా ప్రజలు మరణించారు. వందల మంది తీవ్ర గాయాలతో అక్కడ ఆసుపత్రుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. దీంతో ఈ విషయం పైనే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అడుగడుగునా లేవనెత్తాయి. “జనగణమన” అంటూ సభ ప్రారంభం అవుతూనే.. కాంగ్రెస్ సభ్యులు ఇరు సభల్లోనూ.. “యూపీ మారణహోమం.. ఈ బాధ్యత బీజేపీదే” అంటూ బిగ్గరగా అరుస్తూ.. నినాదాలతో సభను హోరెత్తించారు. ఇలా ఐదు నుంచి 10 నిమిషాలు సాగిందో లేదో..ఇక, సభలో తమ ఆనందానికి అవకాశం లేదనుకున్న బీజేపీ సభ్యులు సభ వాయిదా కోరుకున్నారు. ఆ వెంటనే ఇరు సభలు కూడా బుధవారానికి వాయిదా పడ్డాయి.
ఏంటీ యూపీ వివాదం..?
యూపీలోని సంభల్‌లో ప్రఖ్యాత జామా మసీదు ఉంది. దాదాపు ఆరేడు దశాబ్దాలుగా ఇక్కడ ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఇది రాష్ట్రంలోనూ ప్రత్యేకతను సంతరించుకుంది. ఉత్తరాది మక్కాగా దీనిని పిలుచుకుంటారట! అలాంటి చోట.. గతంలో “హరిహర మందిరం” ఉండేదంటూ.. కొందరు స్థానిక కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు.. ‘అసలు అక్కడ ఏముందో తేల్చండి’ అంటూ పురావస్తు అధికారులను ఆదేశించింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు.
అంతే.. ఒక్క పెట్టున.. ఎక్కడెక్కడ నుంచో తరలి వచ్చిన.. వారు అధికారులు, పోలీసులపై విరుచుకుపడ్డారు. రాళ్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో.. అప్పటికప్పుడు ముగ్గురు చనిపోగా.. వందల మంది గాయపడ్డారు. ఈ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన మరో 50 మంది సోమవారం మృతి చెందారు. ఈ వ్యవహారం ఇప్పుడు దేశాన్ని, పార్లమెంటును కూడా కుదిపేస్తుండగా.. బీజేపీకి మహా ఆనందాన్ని దూరం చేసింది.