ఏపీ విపక్షం వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఇటీవల కాలంలో కొంత ప్రశాంతంగా ఉన్న వైసీపీ రాజకీయాలు .. ఇప్పుడు హఠాత్తుగా వేడెక్కాయి. నెల రోజుల కిందటి వరకు వైసీపీ నుంచి పలువురు నాయకులు బయటకు వచ్చారు. ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా రాజీనామా చేసి ఫ్యాన్ కింద ఉండలేమంటూ.. సైకిల్ ఎక్కారు. దీంతో అప్పట్లో వైసీపీలో కొంత మేరకు అలజడి నెలకొంది. అయితే. .కొన్నాళ్లుగా ఈ వ్యవహారానికి బ్రేకులు పడ్డాయి. వెళ్లిపోతున్నవారిని ఒకింత బుజ్జగించిన పరిస్థితి నెలకొంది.
ఇక, ఇప్పుడు అంతా బాగానే ఉందని భావిస్తున్న సమయంలో బాంబు పేలింది. కృష్ణాజిల్లాకు చెందిన వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ ఏడాది ఎన్నికలకు ఆరేడు మాసాల ముందు ఆయన వైసీపీలో చేరిన విషయం తెలిసిందే. టీడీపీలో సుదీర్ఘకాలం రాజకీయాలు చేసిన జయమంగళ.. వడ్డెర సామాజిక వర్గానికి(బీసీ) చెందిన నాయకుడు. టీడీపీ టికెట్ దక్కదని భావించిన ఆయన వైసీపీలోకి వచ్చారు.
కృష్ణాజిల్లాలోని కైకలూరు టికెట్‌ను ఆయన ఆశించారు. అయితే.. జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. ఈ స్థానంలో ఆయనను సంతృప్తి పరిచేందుకు ఎమ్మెల్సీని చేశారు. ప్రస్తుతం జయమంగళ ఎమ్మెల్సీగా ఉన్నారు. అయితే.. హఠాత్తుగా ఆయన రాజీనామా చేయడం గమనార్హం. అటు పార్టీకి, ఇటు ఎమ్మెల్సీ స్థానానికి కూడా రాజీనామా చేశారు. టీడీపీలో ఉన్న సమయంలో కైకలూరు నుంచి విజయం దక్కించుకున్న ఆయన.. తర్వాత చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించారు.
ఎన్నికలకు ముందు టికెట్ రాదని గ్రహించి జగన్ చెంతకు చేరారు. శుక్రవారంతో ముగిసిన మండలి సమావేశాలకు జయమంగళ హాజరు కాలేదు. ఒకటి రెండు రోజులు మాత్రమే వచ్చినా.. ఆయన టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లారు. ఈ క్రమంలో ఆయన ఏదో భరోసా లభించి ఉంటుందని. అందుకే సడెన్‌గా వైసీపీకి రాజీనామా ప్రకటించారని తెలుస్తోంది. బీసీ వర్గానికి చెందిన నాయకుడు వైసీపీకి దూరం కావడం ఆ పార్టీకి ఇబ్బందేనని అంటున్నారు పరిశీలకులు