ఢిల్లీ చేరిన జ‌ల జ‌గ‌డం.. కేంద్రం మొగ్గు ఎటు?!

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య క‌త్తులు నూరుతున్న జ‌ల వివాదం ఇప్పుడు ఢిల్లీకి చేరింది. మంగ‌ళ‌వా‌రం (ఈ నెల 6) కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర‌సింగ్ షెకావ‌త్ నేతృత్వంలో ఏపీ, తెలంగాణ ముఖ్య‌మంత్రులు .. జ‌గ‌న్‌, కేసీఆర్‌ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌నున్నారు. నిజానికి ఇది ఏపీలోనో.. తెలంగాణ‌లోనో.. జ‌రిగితే.. ఇంపాక్ట్ వేరేగా ఉండేది. కానీ, నేరుగా ఢిల్లాలోనే వెబినార్‌లో నిర్వ‌హిస్తున్నారు. దీంతో ఆస‌క్తి మ‌రింత పెరిగింది. ఏపీ ప్ర‌భుత్వం క‌రువు పీడిత అనంత‌పురం, క‌డ‌ప‌, క‌ర్నూలు జిల్లాల‌కు పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేట‌ర్ ద్వారా నీరు అందించేందుకు సిద్ధ‌మై.. ఈ ప్రాజెక్టు ఎత్తును పెంచాల‌ని నిర్ణ‌యించింది.

అయితే, దీనిని పూర్తిగా వ్య‌తిరేకించిన తెలంగాణ ప్ర‌భుత్వం క‌య్యానికి కాలు దువ్విన విష‌యం తెలిసిందే. నిజానికి ఆదిలో ఇరు రాష్ట్రాల సీఎంలు.. జ‌ల వివాదాల‌పైనే క‌లిసి ముందుకు సాగాల‌ని.. న‌భూతో న‌భ‌విష్య‌తి అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాల‌ని ముఖ్య‌మంత్రులు సంక‌ల్పం చెప్పుకొన్నారు. అయితే, ఈ సంక‌ల్పం.. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేట‌ర్ ఎత్తు పెంచుతామ‌ని ఏపీ ప్ర‌క‌టించ‌డంతో చిన్నాభిన్నం అయింది. ఇక‌, ఈ నేప‌థ్యంలోనే కేసీఆర్ మ‌రింత దూకుడు పెంచారు. అస‌లు శ్రీశైలం ప్రాజెక్టు నిర్వ‌హ‌ణ‌ను కూడా త‌మ‌కే అప్ప‌గించాల‌ని కేంద్రానికి లేఖ‌రాశారు. దీంతో మ‌రింత‌గా ఈ వివాదాలు పెరిగాయి.

ఇక‌, ఇప్పుడు ఈ వివాదాలు ప‌రిష్క‌రించే బాధ్య‌త అనేక అంచ‌లు(ఇంజ‌నీర్ల స్థాయి చ‌ర్చ‌లు, కేఆర్ ఎంబీ చ‌ర్చ‌లు, మంత్రుల స్థాయి సంప్ర‌దింపులు) ముగిసి.. ఇప్పుడు ముఖ్య‌మంత్రుల స్థాయికి చేరింది. అయితే, ఇప్పుడు కేంద్రం వ్య‌వ‌హ‌రించే విధానం కూడా ఆస‌క్తిగా మారింది. ఏపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తుందా? తెలంగాణ త‌ర‌ఫున మాట్లాడుతుందా? లేక త‌ట‌స్థంగా వ్య‌వ‌హ‌రిస్తుందా? అన్న‌ది ఉత్కంఠ‌గా మారింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రంతో ఈ రెండు రాష్ట్రాల‌కు ఉన్న సంబంధాల‌ను ప‌రిశీలిస్తే.. ఏపీ చాలా వ‌ర‌కు కేంద్రం వైఖ‌రికి సానుకూలంగా ఉంది.

ప్ర‌ధాని మోడీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించిన వ్య‌వ‌సాయ బిల్లుకు ఏపీ అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింది. జీఎస్టీ బ‌కాయిలు ఇవ్వ‌క‌పోయినా. అప్పు చేసుకునే అవ‌కాశం ఇవ్వ‌డాన్ని స్వాగ‌తించింది. కానీ, తెలంగాణ మాత్రం అడ‌గడుగునా విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. వ్య‌వ‌సాయ బిల్లుతో రైతుల జీవితాల్లో చీక‌టి రోజులేన‌ని కేసీఆర్ స్వ‌యంగా అసెంబ్లీలో కామెంట్లు చేశారు. ఇక‌, జీ ఎస్టీ బ‌కాయిలు ఎందుకు ఇవ్వ‌ర‌ని ప్ర‌శ్నించారు. పైగా క‌రోనా చికిత్స‌ల విష‌యంలోను, నిధుల విష‌యంలోనూ కేంద్రం త‌మ‌ను మోసం చేసింద‌న్నారు. ఈ ప‌రిణామాలు గ‌మ‌నిస్తే.. కేంద్రంతో కేసీఆర్ వైఖ‌రి వివాదంగానే ఉంద‌ని అనిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఈ జ‌ల‌వివాదాన్ని ఎలా ప‌రిష్క‌రిస్తుంద‌నేది ఆస‌క్తిగా మారింది.