టీడీపీ సీనియర్ నాయకురాలు, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత… రాజకీయంగా చర్చనీయాంశం అయ్యారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఆమె టార్గెట్ చేశారు. ఆది నుంచి కూడా ఇరువురి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు మరింత ఎక్కువ అయ్యాయి. గత ఐదు సంవత్సరాల్లో పరిటాల కుటుంబాన్ని తోపుదుర్తి టార్గెట్ చేసుకుని రాజకీయాలు చేసినట్టే.. ఇప్పుడు సునీత కూడా తోపుదుర్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
చర్యలకు పట్టు..
తోపుదుర్తి 2019లో వైసీపీ తరఫున విజయం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సమయంలో జాకీ అనే పరిశ్రమ ఏర్పాటును ఆయన అడ్డుకున్నారన్నది సునీత అప్పట్లోనే చేసిన విమర్శ. 129 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఏటా 32.4 మిలియన్ల వస్త్రాలను తయారు చేసే పరిశ్రమగా జాకీ పేరు తెచ్చుకుంది. ఇది 2018లో ఏర్పాటైంది. అయితే.. తోపుదుర్తి ఎమ్మెల్యే అయిన తర్వాత.. జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోయింది.
దీనికోసం 2014-19 మధ్య సునీత కష్టపడ్డారనేది వాస్తవం. దీంతో తోపుదుర్తి ఉద్దేశ పూర్వకంగా.. ఈ జాకీని తెలంగాణకు తరిమేశారన్నది ఆమె ఆవేదన.. దీనివెనుక రాజకీయం ఉందని ఆందోళన. ఈ క్రమంలోనే తోపుదుర్తిపై చర్యలు తీసుకోవాలన్నది సునీత చేస్తున్న డిమాండ్. 2017లో పరిశ్రమ ఏర్పాటు కోసం 27 ఎకరాలను.. ఏపీఐఐసీ ద్వారా సునీత కేటాయించేలా చేశారు. అయితే.. ప్రకాష్ రెడ్డి, అతని సోదరులు పరిశ్రమ యాజమాన్యం నుంచి 15 కోట్లు డిమాండ్ చేశారని పరిటాల సునీత ఆరోపణ.
ఈ నేపథ్యంలోనే జాకీ తెలంగాణకు తరలిపోయింది. ఈ క్రమంలో తాము ఆందోళన చేస్తే.. ప్రకాష్ రెడ్డి ప్రోద్బలంతో 40 మంది టీడీపీ, సీపీఐ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టించారన్నది కూడా సునీత ఆవేదన. దీంతో ఇప్పుడు తోపుదుర్తిపై చర్యలకు ఆమె పట్టుబడుతున్నారు. ఆయనపై చర్యలతో పాటు జాకీని తిరిగి తీసుకురావాలని కూడా సునీత కోరుతున్నారు. ఒకవైపు సభలోనూ.. మరోవైపు పర్సనల్‌గా కూడా.. సునీత ఈ విషయంలో గట్టి పట్టుదలతోనే ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.