ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబంపై సాక్షాత్తూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ నోరు చేసుకున్నారు. ఇంటి పెద్ద కొడుకు అయి ఉండి.. తన తల్లి,తండ్రి చనిపోతే.. చంద్రబాబు కనీసం తల కొరివి కూడా పెట్టలేదు
అని సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. ఏ రోజూ వారిని తన ఇంటికి పట్టెడన్నం కూడా పెట్టలేదని.. ఇలాంటి వ్యక్తి తనను, తన కుటుంబాన్నిరోడ్డుకు లాగుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. సుమారు గంటన్నరపైగా మీడియాతో మాట్లాడిన జగన్. అనేక విషయాలు ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బాలకృష్ణలపై ఆయన అనేక వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబుపై..
చంద్రబాబు ఆయన కుటుంబానికి పెద్ద అని, కానీ ఏ నాడూ.. తన బాధ్యతలు నెరవేర్చలేదని జగన్ చెప్పుకొచ్చారు. తల్లి దండ్రులకు ఎవరైనా అన్నం పెడతారని, కానీ, చంద్రబాబు ఆ పని కూడా చేయలేదన్నారు. వారిద్దరూ చనిపోతే తల కొరివి తాను పెట్టకుండా తప్పుకొన్నారని వ్యాఖ్యానించారు. కానీ, ఇప్పుడు తన కుటుంబాన్ని అటు సభలోను, ఇటు బయట కూడా విమర్శిస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. ఇలాంటి నాయకుడితో రాజకీయాలు చేయడం తన దౌర్భాగ్యంగా నిందించుకున్నారు. ఇదేసమయంలో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. ఏం చేసేందుకైనా చంద్రబాబు తెగిస్తారని హెచ్చరించారు.
బాలకృష్ణపై..
టీడీపీ ఎమ్మెల్యే, నటసింహం బాలయ్యపై తొలిసారి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు తన సోదరి షర్మిలను సోషల్ మీడియాలో విమర్శలు చేయించింది బాలయ్యేనని చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ప్రదర్శించారు. 2019 ఎన్నికలకు ముందు తన సోదరి షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఇంటి నుంచి నడిపే సోషల్ మీడియాలో తనను తీవ్రంగా విమర్శిస్తున్నారని ఆమె చెప్పిన వ్యాఖ్యలను జగన్ ప్రదర్శించారు. ఎన్‌బీకే హౌస్ నుంచే విమర్శలు చేయించారంటే.. అవి బాలకృష్ణ చేయించినట్టు కాదా? అని ప్రశ్నించారు.
టీడీపీ కౌంటర్..
జగన్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు, మంత్రులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు వీడియోలు ప్రదర్శిస్తూ.. బాలయ్య పరువు తీస్తున్నారని వారు వ్యాఖ్యానించారు. ఇక, చంద్రబాబు తల్లి దండ్రులు ఎప్పుడైనా మీడియా ముందుకు తమను చూడడం లేదని ఆరోపణలు చేశారా? అని నిలదీశారు. కానీ, జగన్ తల్లి, చెల్లి మాత్రం మీడియా ముందుకు కన్నీరు పెట్టుకున్నారని వారు ఎదురు దాడి చేశారు. జగన్.. తన సొంత చెల్లిపై ఆరోపణలు చేయించలేదా? ఏ అన్న అయినా.. ఇలా చేస్తారేమో.. సిగ్గుంటే చెప్పాలని వారు నిలదీశారు.