శాసనసభ సమావేశాల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారి విషయంలో, గంజాయిని అరికట్టడం, అరాచక శక్తులను కట్టడి చేయడంలో పవన్ తమకన్నా గట్టిగా ఉన్నారని చంద్రబాబు ప్రశంసించారు. ఆ డిటర్మినేషన్ పవన్ కు ఉందని, సంఘ విద్రోహ శక్తులను తామిద్దరం కలిసి అరికడతామని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను అవమానిస్తే అవే వారికి చివరి రోజులు అని వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని చంద్రబాబు అన్నారు. ప్రాణాలకు ముప్పు ఉందని తెలిసినా లెక్క చేయకుండా ముఠా నాయకులు, మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని, నక్సల్స్ ను అడ్డుకొని నియంత్రించానని తెలిపారు. రౌడీ, బ్లేడ్ బ్యాచ్ లు ఉన్నాయని, వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టం చేశారు. పోలీసు వ్యవస్థను కూడా సంస్కరిస్తున్నామని తెలిపారు.
ప్రజాప్రతినిధులు ఎవరూ శాంతిభద్రతలను చేతుల్లోకి తీసుకోవద్దని సున్నితంగా హెచ్చరించారు. అందుకు భిన్నంగా వ్యవహరించే వారిని ఉక్కుపాదంతో అణచివేస్తామని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమి డెడ్లీ కాంబినేషన్ కావాలని ఆకాంక్షించారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించి వారి కుటుంబాలను వృద్ధిలోకి తీసుకెళ్లాలని చంద్రబాబు అన్నారు. ప్రజలకు జవాబుదారీగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, క్షేత్రస్థాయిలో ప్రజలతో కూటమి నేతలు మమేకం కావాలని పిలుపునిచ్చారు.
సీఎంగా తాను కూడా ప్రజలతో ముఖాముఖి కార్యక్రమానికి త్వరలో వెళ్తానని చంద్రబాబు చెప్పారు. కూటమి ప్రభుత్వ 150 రోజుల పాలన గురించి ఎమ్మెల్యేంతా నియోజకవర్గాల్లో తిరిగి ప్రజలకు వివరించాలని సూచించారు. దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఏపీ ఉండాలన్నది తమ ప్రభుత్వ ఆకాంక్ష అని స్పష్టం చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates