జగన్ కు ఆ ఛాన్స్ ఇవ్వం. మేమే పూర్తి చేస్తాం అంటూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ప్రకటించారు. తమ్ముడి మరణం తర్వాత.. తొలిసారి అసెంబ్లీకి వచ్చిన ఆయన మంగళవారం సభలో చేపట్టిన సాగునీట ప్రాజెక్టులపై చర్చలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టునుతామే పూర్తి చేస్తామని ఈ సమయంలో చంద్రబాబు ప్రకటించారు. జగన్‌కు ఆ అవకాశం ఇచ్చేది లేదన్నారు. అదే సమయంలో పోలవరం ఎత్తును కూడా తగ్గించకుండా నిర్ణీత 45.72 మీటర్ల చొప్పునే నిర్మిస్తామన్నారు.
జగన్ కు క్యూసెక్కులకు, టీఎంసీలకు తేడా తెలియదని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఒక్క జగన్‌కే కాదు.. అధ్యక్షా.. గతంలో మంత్రులుగా చేసిన వారికి కూడా టీఎంసీకి, క్యూసెక్కులకు తేడా తెలీదు అని ఎద్దేవా చేశారు. గతంలో పోలవరం గరించి సభలో అడిగితే.. హేళనగా మాట్లాడారని గతాన్ని గుర్తు చేశారు. వైసీపీ హయాంలో పోలవరం పనులు జరిగాయని.. అయితే.. అది 3.08 శాతం పనులే జరిగాయని చెప్పారు. తమ గత హయాంలో రూ.16,493 కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. కానీ, తమ తండ్రి ప్రాజెక్టుగా చెప్పుకొనే జగన్.. తనపాలనా కాలంలో కేవలం 4099 కోట్లు మాత్రమే విదిలించారని వివరించారు.
కేంద్రం నిధులు ఇస్తున్నట్టు చంద్రాబు చెప్పారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిందని, దీంతో వచ్చే రెండేళ్లలో 12 వేల కోట్లకుపైగా సొమ్ములు రానున్నాయని.. కూటమి ప్రభుత్వం ఈ విషయంలో కీలకంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి విడతల వారీగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని చంద్రబాబు వివరించారు. వచ్చే నెలలోనే పనులు ప్రారంభం అవుతాయని, జనవరి నుంచి డయాఫ్రం వాల్ నిర్మాణం మొదలవుతుందన్నారు. ఇది 2026 నాటికి, పూర్తి ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి అవుతాయని సభలో పేర్కొన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates