వైసీపీలో కొత్త చర్చ, రచ్చ తెరమీదికి వచ్చింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చెప్పిన ఫార్ములా.. ‘ఒక బంతిని ఎంత గట్టిగా అదిమి పెట్టి కొడితే.. అది అంతే బలంగా ఎదురొస్తుంది’ ఇప్పుడు వైసీపీలోనూ వినిపిస్తుండడం గమనార్హం. ప్రస్తుతం నలుగురు కొత్త ముఖాలతోపాటు.. రెండోసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు వైసీపీ ఎనిమిది మంది వరకు ఉన్నారు. ఇక, మిగిలిన వారిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటివారు ఉన్నారు. సో.. వీరిద్దరు ముగ్గురిని పక్కన పెడితే.. మిగిలిన ఎనిమిది మంది.. బంతుల మాదిరిగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని.. తాజాగా అసెంబ్లీ లాబీల్లో కూటమి పార్టీల ఎమ్మెల్యేల మధ్య చర్చకు రావడం గమనార్హం.
“వాస్తవానికి ఒక పార్టీ టికెట్ ఇచ్చిన తర్వాత.. ఆ పార్టీ సభ్యుడిగా ఉండడం వరకు తప్పులేదు. అయితే.. నియంతృత్వాన్ని మాత్రం సదరు సభ్యుడు పాటించాల్సిన అవసరం లేదు” అని మహారాష్ట్రలో 2021లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో శివసేన చీలిపోయి.. ఏక్నాథ్ షిండే సీఎం కావడం.. ఆయన వెంట 20 మందికిపైగా ఎమ్మెల్యేలు బయటకు రావడం తెలిసిందే. ఈ క్రమంలో శివసేన అప్పటి చీఫ్ .. సుప్రీంకోర్టును ఆశ్రయించి.. శివసేన లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా తాను గీసిన గీత దాటారంటూ వాదనలు వినిపించారు. అయితే.. ఈ వాదనను కోర్టు కొట్టి వేసింది.
టికెట్ ఇవ్వడం వరకు ఉన్న స్వతంత్రం.. సదరు అభ్యర్థిని సభకు వెళ్లకుండా అడ్డుకోజాలదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇప్పుడు ఈ తీర్పు+ జగన్ చెప్పిన బంతి ఫార్ములా వెరసి.. వైసీపీలో 8 మంది ఎమ్మెల్యేలు.. యూటర్న్ తీసుకుంటారన్నది కూటమి ఎమ్మెల్యేల మధ్య జరుగుతున్న చర్చ. అంటే.. సభకు రావాలని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు.. జగన్ అణిచి వేతను ఇక, భరించలేరని.. తమకు కూడా వ్యక్తిత్వం ఉందన్న భావనతో ఉన్నారని.. కూటమి పార్టీల ఎమ్మెల్యేలు గుసగుసలాడుతు న్నారు. ఈ క్రమంలో జగన్ ను కాదని వారు సభకు వచ్చే అవకాశం ఉందని.. దీనికి న్యాయ రక్షణ కూడా ఉంది కాబట్టి వారిని ఆపడం కష్టమేనని వ్యాఖ్యానిస్తున్నారు.
అంతేకాదు.. జగన్ చెప్పిన బంతి ఫార్ములా(ఎంత బలంగా అదిమి పెడితే అంతే బలంగా ఎగురుతుంది) ప్రకారం.. వైసీపీ ఎమ్మెల్యేలను ఎంత నియంతృత్వ ధోరణితో అణిచేస్తే.. అంతే వారిలో తిరుగు బాటు వస్తుందని కూడా అంచనా వేస్తున్నారు. వారు జగన్కు సానుకూలంగా ఉన్నా.. ప్రజలకు రేపు ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాల్సి ఉంటుందని.. అందుకే వారు ఏక్షణంలో అయినానిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని కూటమి పార్టీల ఎమ్మెల్యేలు లాబీల్లో వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. మరి ఏం జరుగుతుందో చూడాలి.