వైసీపీ అధినేత జగన్‌కు రాజకీయ గురువుగా వ్యవహరించిన విశాఖ శారదా పీఠం అధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి బోర్డు భారీ షాక్ ఇచ్చింది. తిరుమలలో శారదా పీఠానికి వైసీపీ హయాం లో కల్పించిన అన్ని వసతులను రద్దు చేసింది. అదేసమయంలో శారదా పీఠానికి తిరుమలలోని బేడీ ఆంజనేయ స్వామి ఆలయానికి ఎదురుగా కేటాయించిన స్థలం కూడా వెనక్కి తీసుకుంది. అలాగే.. శారదా పీఠం కోసం ఇచ్చిన లీజును కూడా రద్దు చేసింది. ఇక, ఎవరికీ లేని విధంగా శారదా పీఠాధిపతి స్వరూపానంద తిరుమలకు వస్తే.. కేబినెట్ ర్యాంకు హోదాతో ఆయనకు దర్శన ఏర్పాట్లు చేసేలా జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా తాజాగా రద్దు చేశారు.
ఈ పరిణామాలతో శారదా పీఠానికి ఊపిరి ఆడని పరిస్థితి నెలకొంది. వైసీపీ హయాంలో శారదా పీఠాధిపతి ఓ రేంజ్ రాజకీయాలు చేసిన విషయం తెలిసిందే. విశాఖలో భీమిలి తీరం వెంబడి 15 ఎకరాల స్థలాన్ని కూడా లీజుకు తీసుకున్నారు. అయితే.. ఇటీవలే చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆ లీజును రద్దు చేసి.. భూమిని వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వంతు వచ్చింది. తాజాగా పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా చర్చించిన అంశం.. శారదాపీఠానికి భూములు, ఇతరత్రా సౌకర్యాలు కల్పిస్తూ.. వైసీపీ హయాంలో తీసుకున్న నిర్ణయాలే కావడం గమనార్హం.
ఇతర.. నిర్ణయాలు ఇవీ..
- 10 వేల రూపాయలు తీసుకుని భక్తులకు కల్పించే శ్రీవాణి(తిరుమల పేరుతో వివిధ ప్రాంతాల్లో నిర్మించే ఆలయాలకు విరాళం) దర్శనాల విషయంలో మార్పులు. ఈ సొమ్మును ఇక నుంచి నేరుగా శ్రీవారి ఖాతాలోకి తీసుకుంటారు. తద్వారా.. శ్రీవాణి ట్రస్టును రద్దు చేశారు.
- తిరుమల సహా.. అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులను తిరుమలకు చెందిన ఇతర విభాగాలకు కేటాయిస్తారు. అంటే.. ఆసుపత్రులు, పార్కులు, కళ్యాణ మండలా విధులు కేటాయిస్తారు. అది కూడా పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్నవారిని రెన్యువల్ చేయబోరు.
- సాధారణ భక్తులకు పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకున్నారు. సర్వదర్శనం కోసం.. క్యూ కాంప్లెక్సుల్లో వేచి ఉండే వారికి శ్రీవారి దర్శన భాగ్యం ఎప్పుడు లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఒక్కొక్కసారి 18 గంటల పాటు కూడా దర్శనానికి సమయం పడుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వీరికి 2 నుంచి 3 గంటల్లో(ఎంత రద్దీ ఉన్నా) శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయించారు.
- తిరుమలలో రాజకీయాలు మాట్లాడటంపై నిషేధం విధించారు. ఎవరు వచ్చినా.. కొండ కింద మాత్రమే మీడియాతో మాట్లాడాల్సి ఉంటుంది. పైన ఉన్న మీడియా పాయింట్‌ను తొలగించనున్నారు. ఇక, తిరుమలలో అతిథి గృహాలకు సొంతపేర్లు పెట్టరాదని కూడా నిర్ణయించారు. దాతలు సొమ్ములు ఇచ్చినా.. వారికి నచ్చిన శ్రీవారి సహస్రనామాల్లో ఒకదానిని సెలక్ట్ చేసి పెట్టనున్నారు.