ఎంత మంది పిల్ల‌లున్నా.. ఎన్నిక‌ల్లో పోటీకి ఓకే

ఏపీ పంచాయతీరాజ్, మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు శాస‌న స‌భ ఆమోదం తెలిపింది. దీని ప్ర‌కారం పంచాయ‌తీలు, న‌గ‌ర పాల‌క సంస్థ‌లు, కార్పొరేష‌న్ల‌లో పోటీ చేసే వారికి వెసులు బాటు క‌ల్పించ‌నున్నారు. అంటే ఎన్నికల‌కు సంబంధించిన నిబంధన లు మారనున్నాయి. చట్ట సవరణ ప్రకారం ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని అనుకున్న అభ్య‌ర్థులకు ఎంత మంది పిల్లలున్నా పోటీ చేసే అవకాశం ఉంటుంది. మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీ ఎన్నిక‌లకు సంబంధించి ఈ స‌వ‌ర‌ణ గ్రామీణ ప్రాంతాల‌కు వ‌రంగా మార‌నుంది. ఈ స‌వ‌ర‌ణ బిల్లును తాజాగా సోమ‌వారం నాటి అసెంబ్లీలో ఆమోదించారు.

మంత్రి పొంగూరు నారాయ‌ణ ప్ర‌వేశ పెట్టిన ఈ బిల్లును స‌భ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం.. దీనిని శాస‌న మండ‌లి కి పంపించ‌నున్నారు. అక్క‌డ కూడా ఆమోదం పొందితే(ప్ర‌స్తుతం వైసీపీ స‌భ్యుల సంఖ్య ఎక్కువ‌గా ఉంది) ఆ త‌ర్వాత గ‌వ‌ర్న‌ర్‌కు పంపించ‌నున్నారు. గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలిపిన వెంట‌నే ఇది చ‌ట్ట‌రూపం దాల్చ‌నుంది. అత్యంత కీల‌కంగా మార‌నున్న ఈ చ‌ట్ట స‌వ‌ర‌ణ అంశంపై స‌భ్యులు ఏక‌గ్రీవ ఆమోదం తెల‌ప‌డం గ‌మ‌నార్హం. నిజానికి వైసీపీ హ‌యాంలోనే ఈ బిల్లును తీసుకువ‌చ్చారు. అయితే.. ఎన్నిక‌ల‌కు ముందు తీసుకువ‌చ్చిన బిల్లు కావ‌డంతో ఇది నిలిచిపోయింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న విధానం ఏంటి?

పంచాయ‌తీలు, మునిసిపాలిటీల్లో పోటీ చేయాల‌ని భావించే వారికి కొన్ని చ‌ట్ట నిబంధ‌న‌లు ఉన్నాయి. పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం ప్ర‌కారం.. ప‌ల్లెల్లో ముగ్గురుక‌న్నా ఎక్కువ మంది పిల్ల‌లు ఉన్న‌వారు ఎన్నిక‌ల్లో పోటీకి అన‌ర్హులుగా మారుతారు. ఇక‌, మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్ల‌లోనూ ఇదే త‌ర‌హా చ‌ట్టం ఉన్నా.. పెద్ద‌గా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. అయితే.. గ్రామీణ ప్రాంతాల‌కు కేంద్రం నుంచి నిధులు వ‌చ్చే అవ‌కాశం ఉన్నందున అక్క‌డ మాత్రం ప‌క్కాగా పంచాయ‌తీ చ‌ట్టం అమ‌లు చేస్తున్నారు. దీనివ‌ల్ల అనేక మందికి రాజ‌కీయంగా అవ‌కాశం ల‌భించ‌డం లేద‌న్న విమ‌ర్శ ఉంది. దీనిని 1950ల‌లోనే చేయ‌డం గ‌మ‌నార్హం.

గ్రామీణ ప్రాంతాల్లో జ‌నాభాను నియంత్రించ‌డం కోసం తీసుకువ‌చ్చిన చ‌ట్టంగా దీనిపై చ‌ర్చ ఉంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తుతం కూట‌మి ప్ర‌భుత్వం రాష్ట్రంలో జ‌నాభా వృద్ధి రేటును పెంచాల‌ని నిర్ణ‌యించుకున్న ద‌రిమిలా.. ఈ చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేసింది. త‌ద్వారా జ‌నాభా ప్రాతిప‌దిక‌న కేంద్రం నుంచి వ‌చ్చే ప‌న్నుల్లో వాటా ఏపీకి మ‌రింత పెర‌గ‌నుంది. అదేవిధంగా 30 ఏళ్ల త‌ర్వాత‌.. వృద్ధ జ‌నాభా పెరిగినా.. దానికి స‌మాంత‌రంగా యువ జ‌నాభా అందుబాటులోకి వ‌స్తుంద‌న్న‌ది స‌ర్కారు ఆలోచ‌న‌. ఈ నేప‌థ్యంలోనే చ‌ట్టానికి స‌వ‌ర‌ణ చేయ‌డం గ‌మ‌నార్హం.