వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న కారణంతో అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదని పులివెందుల ఎమ్మెల్యే జగన్ చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు సభకు వస్తే వారికి తగినంత సమయం ఇస్తామని స్పీకర్ అయ్యన్న కూడా చెప్పారు.
కానీ, జగన్ మాత్రం సభకు రాకపోవడంతో రాజీనామా చేయాలని, డిస్ క్వాలిఫై చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీకి వచ్చే చిట్కా చెబుతానని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి.
రోజుకో గంట జగన్‌కు మాట్లాడేందుకు సమయం ఇస్తే సభకు వస్తారని కోటంరెడ్డి అన్నారు. 2017లో జగన్ పాదయాత్రకు వెళ్లే సమయంలో కూడా వేరేవారికి బాధ్యతలు అప్పగించి వెళ్ళాలని, కానీ జగన్ అలా చేయలేదని, తాను తప్ప మిగతావారు మాట్లాడటం జగన్ కు ఇష్టం ఉండదని చెప్పారు.
ఆ కారణంతో ఇప్పుడు కూడా జగన్ అసెంబ్లీకి రావడం లేదని, ఎవరినీ రానివ్వడం లేదని కోటంరెడ్డి అన్నారు. మైక్ ఆయన ఒక్కడికే ఉండాలని, జగన్‌కు గంట మాట్లాడే అవకాశం స్పీకర్ ఇస్తానంటే మంగళవారం నాడు ఆయన అసెంబ్లీకి వస్తారని కోటం రెడ్డి చురకలంటించారు.
జగన్‌ను చూసి చాలా రోజులవుతోందని, ఆయన మాత్రం అసెంబ్లీకి రావడం లేదని కోటం రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ మాట్లాడేటప్పుడు ఎవరూ అడ్డుపడకూడదని, అది జగన్ ఫిలాసఫీ అని సెటైర్లు వేశారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఏనాడూ ప్రజా సమస్యల కోసం పోరాడలేదని, మైక్ కోసమే పోరాడమని చెప్పేవారని కోటంరెడ్డి గుర్తు చేసుకున్నారు.