ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్.. అసెంబ్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలను ఆయన రాబందులతో పోల్చారు. రాబందుల పనిపడతాం అని హెచ్చరించారు. ఏపీ అసెంబ్లీలో సోమవారం కార్యకలాపాలు ప్రారంభం అవుతూనే జగన్ పాలనా కాలంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల వ్యవహారంపై చర్చ సాగింది. జగనన్న ఇళ్లు పేరుతో పేదలకు అప్పట్లో భూములు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములు కొనుగోలు చేసింది.
ఈ క్రమంలో భారీ అవినీతి జరిగిందని.. ప్రభుత్వం భూములు కొంటుందని తెలిసిన వైసీపీ నాయకులు ముందుగానే భూములు కొనేసి.. తర్వాత వాటిని ప్రభుత్వానికి అమ్మి భారీ ఎత్తున సొమ్ములు చేసుకున్నా రని టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి సహా పలువురు సభ దృష్టి కి తెచ్చారు. ఈ సందర్భంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. పేదల పేరుతో వైసీపీ నేతలు రాబందులుగా మారి.. ప్రభుత్వ సొమ్మును దోచేశారని వ్యాఖ్యానించారు.
అసైన్డ్ భూములు కూడా తక్కువ ధరలకు కొనేసి ప్రభుత్వానికి అధిక ధరలకు విక్రయించారని తెలిపారు. 9 లక్షల పైచీలుకు అసైన్డ్ భూముల్లో వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలు జరిగాయన్నారు.రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామసభలు పెట్టి అభ్యంతరాలపై చర్చిస్తామని తెలిపారు. భూములు దోచుకున్న వైసీపీ రాబందులపై చర్యలు తప్పువని కూడా మంత్రి అనగాని హెచ్చరించారు. అదేసమయంలో తప్పుచేసిన అధికారులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు.
చిత్రం ఏంటంటే.. సభలో వైసీపీ ఎమ్మెల్యేలు లేకపోయినా.. ఒకరిద్దరు టీడీపీ నాయకులే విపక్ష పాత్ర పోషించారు. ఎక్కడెక్కడ ఎలాంటి తప్పులు జరిగాయో మంత్రి వివరించాలని వారు కోరారు. దీంతో సభలో ఒక్కసారిగా ఆశ్చకర వాతావరణం ఏర్పడింది. దీంతో మంత్రి.. ఆయా వివరాలను జిల్లాల వారీగా వివరించారు. అన్నమయ్య, చిత్తూరు, అనంతపురం, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో భూముల అక్రమాలు ఎక్కువగా జరిగాయని చెప్పారు.