ఉత్తరప్రదేశ్ లోని హథ్రస్ జిల్లాలోని బుల్ గడి గ్రామంలో యువతిపై జరిగిన హత్యాచార ఘటన తీవ్రత తగ్గించడానికి ప్రయత్నించి విఫలమైన యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం దిగొచ్చింది. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు, కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్షాల ఒత్తిడికి తలొంచిన యోగి ప్రభుత్వం ఘటనపై సీబీఐ విచారణకు సిఫారసు చేసింది. పొలంలో పనిచేసుకుంటున్న యువతిపై నలుగురు యువకులు దాడిచేసి గాయపరిచారు. అంతేకాకుండా యువతిపై అత్యాచారం చేసి హత్య చేసినట్లు అభియోగాలున్నాయి. ఘటన వెలుగు చూసిన తర్వాత గ్రామంలో, ఉత్తరప్రదేశ్ లో మాత్రమే గొడవ మొదలైంది.
అయితే ఎప్పుడైతే అడిషినల్ డీజీపీ స్ధాయి పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని యువతిపై అత్యాచారం జరగలేదని చెప్పారో వెంటనే నిప్పు రాజుకుంది. ఘటన హైలైట్ కాగానే ముందుగా కాంగ్రెస్ పార్టీ జోక్యం చేసుకుంది. రాహూల్ గాంధి, ప్రియాంక గాంధిలు వెంటనే హథ్రస్ కు వెళ్ళి బాధితురాలి కుటుంబసభ్యులను కలుద్దామని చేసిన ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా రాహూల్, పోలీసులకు మధ్య జరిగిన వివాదంలో రాహూల్ ను పోలీసులు రోడ్డుపైకి తోసేయటంతో ఘటన ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఇక అక్కడి నుండి ఘటన మొత్తం దేశాన్ని ఆకర్షించింది. దాంతో బీజేపికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీలన్నీ ఏకమైపోయి ఆందోళనలను పెంచేశాయి.
దాంతో ఉత్తరప్రదేశ్ లో ఒక్కసారిగా ఉద్రిక్తతలు మొదలయ్యాయి. దీనికితోడు ప్రభుత్వం గ్రామం మొత్తానికి బ్యారికేడ్లు ఏర్పాటు చేయటం, మీడియాను కూడా గ్రామంలోకి అనుమతించకపోవటంతో టెన్షన్ మరింతగా పెరిగిపోయింది. ఇదే సమయంలో రాహూల్ , ప్రియాంకగాంధిలు రెండోసారి బాధిత కుటుంబాన్ని కలిసేందుకు హథ్రస్ కు చేరుకున్నారు. దాంతో క్షేత్రస్ధాయిలోని పరిస్దితులను అర్ధం చేసుకున్న ప్రభుత్వం అక్కా, తమ్ముళ్ళతో పాటు అన్నీ రాజకీయ పార్టీల నేతలను గ్రామంలోకి అనుమతించింది. ఇదే సమయంలో మీడియాపై పెట్టిన ఆంక్షలను కూడా ఎత్తేసింది.
ఘటన తీవ్రతను దృష్టిలో పెట్టుకుని, జనాల మూడ్ ను ఆలోచించిన ప్రభుత్వం ముందుజాగ్రత్తగా కేసును సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిసైడ్ చేసి కేంద్ర హోంశాఖకు సిఫారసు చేసింది. అయితే బాధితురాలి కుటుంబసభ్యులు మాత్రం సీబీఐ విచారణలో తమకు నమ్మకం లేదని కాబట్టి ఈ కేసు విచారణ సుప్రింకోర్టు పర్యవేక్షణలోనే జరగాలంటు డిమాండ్ చేస్తున్నారు. ఘటనను ఘటనగా చూసుంటే దేశవ్యాప్తంగా ఇంత గొడవ జరిగేది కాదేమో. ఎప్పుడైతే ఘటన వెనుక రాజకీయశక్తుల ప్రవేశం జరిగిందో అప్పటి నుండే కేసులో అనేక వివాదాలు పెరిగిపోయాయి. దాంతో ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా హైలైట్ అయిపోయింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates