ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరి ఆరు మాసాలు కూడా కాలేదు. కేవలం ఐదు మాసాలు మాత్రమే పూర్తయింది. కానీ, ఇంతలోనే పారిశ్రామిక వేత్తలు.. మేధావులు, ఇనిస్టిట్యూషనిస్టులు క్యూ కడుతున్నారు. పెట్టుబడులు పెడతామంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు చేస్తున్నారు. అయితే.. ఇదంతా కూడా సీఎం చంద్రబాబు విజన్, ఆయన దూరదృష్టి, విజన్ 2047 వంటి అంశాల ఆధారంగా.. ఆయనపై ఉన్న నమ్మకంతో వారంతా వస్తున్నారని భావించవచ్చు.
అయితే.. పారిశ్రామిక వేత్తలను పక్కన పెడితే.. ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు కూడా ఏపీకి క్యూ కడుతుండ డం విశేషం. కొన్ని రోజుల కిందట యోగా గురువుగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన రాం దేవ్ బాబా అమరావతికి వచ్చారు. సీఎం చంద్రబాబును కలిశారు. ఇది అప్పట్లో ఆశ్చర్యంగాను చర్చనీయాంశంగా కూడా మారింది. సాధారణంగా పారిశ్రామిక వేత్తలు రావడం పెద్ద విషయం కాదు. కానీ, యోగా గురువు వంటివారు రావడం.. ఇక్కడ పెట్టుబడులు పెట్టి యోగాను నేర్పిస్తానని చెప్పడం వంటిది మాత్రం ఆసక్తిగా మారింది.
ఇక, తాజాగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రవిశంకర్ కి సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి ఆయన్ను సత్కరించారు. ఈ సమయంలో సుమారు 50 నిమిషాలకు పైగానే ఇరువురి మధ్య చర్చలు జరిగాయి. ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనేది ఆధ్యాత్మిక సంస్థ. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనే ఉంది. దీనిని ఏపీలోనూ ఏర్పాటు చేయాలని ఆయన భావిస్తున్నారు.
ఈవిషయాన్ని సీఎం చంద్రబాబుకు రవిశంకర్ చెప్పుకొచ్చారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఏర్పాటుతో ప్రపంచ స్థాయిలో ఆధ్యాత్మిక గుర్తింపు రావడం ఖాయమని తెలిపారు. అనేక మంది విదేశాలకు చెందిన వారు తమ సంస్థలో భాగస్వాములుగా సభ్యులుగా ఉన్నారని చెప్పారు. ఇది వాస్తవం కూడా. సో.. వారంతా కూడా ఏపీ వైపు చూసే అవకాశం ఉంది. అంటే.. ఒకరకంగా ఆధ్యాత్మిక శోభ కూడా ఏపీకి రానుంది. నిజానికి ఇలాంటి వాతావరణం ఏర్పడేందుకు అత్యంత అరుదైన అవకాశం మాత్రమే ఉంటుంది. అది దక్షిణాదిలో ఏపీకి లభించడం గమనార్హం. మొత్తంగా బాబుకు మంచి సంకేతాలు వస్తున్నాయన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట.