ఏపీ మాజీ సీఎం జగన్ పై ఆయన సోదరి, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చాలాకాలంగా తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా అసెంబ్లీకి జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టిన నేపథ్యంలో జగన్ పై షర్మిల సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ కు అసెంబ్లీకి వెళ్లే దమ్ము, ధైర్యం, సామర్థ్యం లేకుంటే తన శాసన సభ్యత్వానికి రాజీనామా చేయాలని షర్మిల డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా షర్మిల వ్యాఖ్యలపై జగన్ తొలిసారి స్పందించారు.
అసెంబ్లీకి వెళ్లని వైసీపీ సభ్యులు రాజీనామా చేయాలన్న షర్మిల డిమాండ్ పై స్పందించాలని జగన్ ను ఓ మీడియా ప్రతినిధి కోరగా అందుకు జగన్ ఆసక్తికర సమాధానమిచ్చారు. తనతోపాటు వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేస్తారని ప్రచారం జరుగుతోదంని, కానీ, తనను, వైసీపీ సభ్యులను డిస్ క్వాలిఫై చేసే అధికారం వీరికి లేదని జగన్ అన్నారు. ఒకవేళ తనను డిస్ క్వాలిఫై చేయాలనుకుంటే తాను రెడీ అని, తాను ఇక్కడే ఉన్నానని, డిస్ క్వాలిఫై చేసుకోవచ్చని జగన్ ఛాలెంజ్ చేశారు.
ఇక, తన చెల్లెలి గురించి ఇక్కడ మాట్లాడవద్దని జగన్ అన్నారు. అయినా, ఏపీ రాజకీయాలపై ప్రభావం చూపని కాంగ్రెస్ పార్టీ గురించి, 1.17 శాతం ఓటు బ్యాంక్ ఉన్న ఆ పార్టీ గురించి మాట్లాడడం అనవసరమని జగన్ తేల్చేశారు.
ఇక, 2019లో చంద్రబాబు పోతూ పోతూ తన ప్రభుత్వానికి ఎన్నో గిఫ్ట్ లు ఇచ్చారని, 42 వేల 183 కోట్ల రూపాయలు బకాయిలు ఇచ్చి వెళ్లారని జగన్ ఎద్దేవా చేశారు. ఆ తర్వాత అప్పులంటూ తనపై దుష్ప్రచారం చేశారని అన్నారు. చంద్రబాబు కన్నా తాను తక్కవ అప్పులే చేశానని అన్నారు. అసెంబ్లీ సాక్షిగా పెట్టిన బడ్జెట్ లో ఈ విషయం తేటతెల్లమైందని తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates