శాసన సభ సమావేశాలను వైసీపీ బాయ్ కాట్ చేయడంపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. తమకు మైక్ ఇవ్వడం లేదని కుంటి సాకులు చెబుతున్న అసెంబ్లీకి వైసీపీ సభ్యులు వెళ్లకపోవడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ కూడా జరిగింది. అయితే, అసెంబ్లీకి వెళ్లని వైసీపీ…శాసన మండలికి మాత్రం వెళ్లడంపై కూడా విమర్శలు వచ్చాయి. సంఖ్యాబలం ఉంది కాబట్టి అక్కడకు వెళుతున్నారు వైసీపీ ఎమ్మెల్సీలు. కానీ, అది కూడా ఒక్క రోజు ముచ్చటే అయింది. తాజాగా నేడు జరిగిన మండలి సమావేశాల నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేయడం చర్చనీయాంశమైంది.
విశాఖపట్నం జిల్లాలో డయేరియా మరణాలపై సభలో చర్చ జరిగింది. అక్కడ అసలు డయేరియా మరణాలే లేవంటూ మంత్రి సత్య కుమార్ పేర్కొన్నారు. కానీ, అక్కడ పదుల సంఖ్యలో డయేరియా మరణాలున్నాయని వైసీపీ ఎమ్మెల్సీలు సభలో నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే సత్య కుమార్ వ్యాఖ్యలను నిరసిస్తూ శాసనమండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీలు వాకౌట్ చేశారు
ప్రశ్నోత్తరాల సమయంలో మండలి ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ సమస్యను లేవనెత్తారు.
గుర్ల గ్రామంలో 200 మంది డయేరియా బారిన పడ్డారని, వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయరాని, అధికారులు వచ్చి పరిశీలించారని వివరించారు. డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వచ్చి 10 మంది చనిపోయారని చెప్పారని గుర్తు చేశారు. అటువంటి సమయంలో సంబంధిత మంత్రి ఎవరూ చనిపోలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలకు వైఎస్ జగన్ రూ. 2 లక్షల సహాయం చేశారని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటివరకు పరిహారం ప్రకటించలేదని నిలదీశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates