విజయవాడ కార్పొరేషన్‌లో వైసీపీ జెండా దించేశారు. నిన్న మొన్నటి వరకు కార్పొరేషన్ వెలుపల ప్రహరీ ని ఆనుకుని ఉన్న జెండా దిమ్మెపై వైసీపీ ఎన్నికల జెండాను ఎగురవేశారు. అయితే.. సోమవారం మాత్రం జెండాను తీసేశారు. దీంతో ఏం జరిగిందన్న చర్చ ఆసక్తిగా మారింది. విజయవాడ కార్పొరేషన్‌ను గత 2021లో జరిగిన స్థానిక ఎన్నికల్లో వైసీపీ దక్కించుకుంది. జనరల్‌కు కేటాయించి మేయర్ పదవిని కూడా బీసీ సామాజిక వర్గానికి కేటాయించి మరీ ప్రాధాన్యం ఇచ్చారు.
దీంతో కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే. కూటమి సర్కారు వచ్చిన తర్వాత.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మెజారిటీ వైసీపీ కార్పొరేటర్లు.. వైసీపీకి దూరమయ్యారు. తాజాగా 32 మంది కార్పొరేటర్లు జెండా మార్చేశారు. కొందరు టీడీపీలో చేరగా.. 19 మంది జనసేన బాట పట్టారు. దీంతో సంఖ్యా పరంగా వైసీపీకి సీట్లు తగ్గాయి. మరోవైపు మేయర్ కూడా.. జనసేన వైపు చూస్తున్నారన్న చర్చ సాగుతోంది. ఈ పరిణామాలతోనే కౌన్సిల్ సమావేశాలు కూడా జరగడం లేదు.
ఇదిలావుంటే.. ప్రస్తుతం ఉన్న కార్పొరేటర్లను కూడా.. టీడీపీలో చేర్పించేలా కొందరు సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా సెంట్రల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తన పరిధిలోని కార్పొరేటర్లను టీడీపీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే.. పూర్తిగా వైసీపీ కార్పొరేటర్లు పార్టీ మారడం ఖాయమని తెలుస్తోంది. మరోవైపు.. పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి కూడా.. కొందరిని బీజేపీలోకి చేర్పించడం ద్వారా.. తన హవా పెంచుకునే ఉద్దేశంలో ఉన్నారు.
అయితే.. బీజేపీలోకి కార్పొరేటర్లు వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డు పడుతున్నారు. ఇదే జరిగితే.. అది సుజనాకు మరింత దన్నుగా మారుతుందనివారు భావిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీలో చేరేవారికి డిమాండ్ పెరుగుతోంది. వార్డు పరిధిలో నిధులు, వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం.. కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే.. వైసీపీ పోవడం అయితే ఖాయం అయిపోయింది.అ యితే.. ఇంత జరుగుతున్నా స్థానిక మాజీ మంత్రి వైసీపీ నాయకుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం సైలెంట్ అయిపోయారు.