ఫొటోల పిచ్చి..జగన్, లోకేష్ ల మధ్య తేడా ఇదే

వైసీపీ పాలనలో రంగుల పిచ్చిపై కోర్టులు సైతం జగన్ సర్కార్ కు పలుమార్లు మొట్టికాయలు వేసిన సంగతి తెలిసిందే. అయినా సరే తీరు మారని గత ప్రభుత్వం…చిన్న పిల్లలు తినే ఫల్లీ చిక్కీలు మొదలు పాఠ్యపుస్తకాల వరకు అవకాశమున్న అన్ని చోట్ల వైసీపీ జెండా రంగులు..జగన్ ఫొటో ముద్రించింది.

విద్యా వ్యవస్థను రాజకీయాల్లోకి గత ప్రభుత్వం లాగిందని ఉపాధ్యాయులు కూడా పలు సందర్భాల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ వ్యవహారంపై ఏపీ విద్యా శాఖా మంత్రి నారా లోకేష్ స్పందించారు.

విద్యా వ్యవస్థను రాజకీయాలకు దూరంగా ఉంచాలన్న లక్ష్యంతో ఈ ప్రభుత్వం పనిచేస్తోందని లోకేష్ అన్నారు. గత ప్రభుత్వంలో ఫొటోలు, పేర్లు, రంగుల పిచ్చి చూశారని, తాను మంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వంలో విద్యాశాఖా మంత్రి అయిన తన ఫొటో గానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఫొటో గానీ ఎక్కడా ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశానని లోకేష్ అన్నారు.

ఈ కార్యక్రమంలో కూడా ఎక్కడా తన ఫొటో, చంద్రబాబు గారి ఫొటో లేదని గుర్తు చేశారు. విజయవాడలో జరిగిన జాతీయ విద్యా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అధ్యాపకులను గత ప్రభుత్వం మద్యం షాపుల ముందు నిలబెట్టిందని లోకేష్ ధ్వజమెత్తారు. తాము ఉపాధ్యాయులను గౌరవిస్తామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు సిలబస్ కన్నా యాప్‌ల పనే ఎక్కువగా ఉందని, తమ ప్రభుత్వంలో అలా ఉండబోదని చెప్పారు. ఆత్మలతో మాట్లాడే ముఖ్యమంత్రి ఉండడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారని జగన్ పై లోకేష్ సెటైర్లు వేశారు.