పిల్లి సాధు జంతువే. ఎంతో ముచ్చటగా ఉంటుంది. మనం చెప్పినట్టు చేస్తుంది. కానీ, దానిని బంధిస్తే.. ఎదురు తిరుగుతుంది. ఇప్పుడు వైసీపీలోనూ ఇదే జరుగుతోంది. నిన్న మొన్నటి వరకు జగన్ అంటే భయ భక్తులు ప్రదర్శించిన ఎమ్మెల్యేలు.. ఇప్పుడు ఎదురు తిరిగేందుకు రెడీ అవుతున్నారు. ఇది వాస్తవం. క్షేత్రస్థాయిలో రాజకీయాలు మారుతున్నాయి. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేల్లో 8 మంది వరకు ఇప్పుడు జగన్‌ను ఎదిరించేందుకు రెడీ అయ్యారు.
ఏ ఎమ్మెల్యే అయినా.. అంతిమ లక్ష్యం.. నియోజకవర్గంలో పేరు సంపాయించుకోవడం. ప్రజలకు చేరువ గా ఉండడం. ఇది జరగాలంటే.. నియోజకవర్గంలో అంతో ఇంతో పనులు చేయించుకోవాలి. ఇది కావాలంటే.. సభకు వెళ్లాలి.. సమస్యలపై చర్చకు పెట్టాలి. అంతేకాదు.. ప్రస్తుతం పెరిగిపోయిన.. సోషల్ మీడియా ప్రభావంతో ఎమ్మెల్యే సభలో మాట్టాడారో లేదో .. తెలుసుకోవడం ప్రజలకు ఈజీ అయిపోయింది. దీంతో తమ ఎమ్మెల్యే సభలో ఏం చేస్తున్నాడనే చర్చ కూడా చేస్తున్నారు.
అయితే.. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు వెళ్లకుండా జగన్ అడ్డుకుంటున్నారు. తన పంతానికి ఎమ్మెల్యేలను బలి చేస్తున్నారనే వాదన వైసీపీలో క్షేత్రస్థాయిలోనే వినిపిస్తున్న వాదన. ఇది ఆయనకు ఇబ్బందిగా మారింది. అయినా.. జగన్ తన పంతం .. పట్టుదలలను వీడడం లేదు. దీంతో ఎమ్మెల్యేలు కూడా.. ఇక, మేం మారాల్సిందే! అనే నిర్ణయానికివచ్చేస్తున్నారు. ఈ క్రమంలో వారు తమ దారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారు.
జగన్‌ను ఎదిరించి అయినా.. సభకు వెళ్లేందుకు నలుగురి నుంచి ఆరుగురు ఎమ్మెల్యేల వరకు రెడీ అయ్యారు. మహా అయితే.. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు. సభ్యత్వం అయితే రద్దు కాదు కదా!? అనేది వారి ఆలోచన. ఇలా వెళ్లకుండా.. జగన్ ఆదేశాల మేరకు ఉండిపోతే.. నియోజకవర్గంలో డమ్మీలు అయిపోతున్నామన్న బాధ, ఆవేదన రెండూ వారిలో కనిపిస్తున్నాయి. కొత్తగా ఎన్నికైన వారైతే.. సభ రూపు రేఖలు కూడా ఇంకా చూడలేదన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీంతో ఇలాంటి వారు సభకు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. మరోవైపు.. జగన్‌ను ఎదరించి సభకు వచ్చే వారికి.. సమస్యలు ప్రస్తావించే వారికి అధికార పక్షం అండగా ఉండేలా వ్యవహరించేందుకు రెడీగా ఉంది. సో.. ఏక్షణమైనావైసీపీలో ముసలం పుట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, జగన్ మాట ను వినేందుకు ఎవరూ సిద్ధంగా అయితే లేరు. కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని, కూటమి ప్రభావాన్ని ఎదుర్కొని గెలిచిన తర్వాత.. ఇంట్లో ఉంటే.. ఇక, ఎప్పటికీ ప్రజలు తమను విశ్వసించరనే భావన కూడా వారిని వెంటాడుతుండడం గమనార్హం. సో.. వచ్చే రెండు మూడు రోజుల్లో సంచలనాలు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates