వైసీపీ నాయకులకు ఒకవైపు సోషల్ మీడియా కామెంట్లు, పోస్టుల చిక్కులు వెంటాడుతున్నాయి. సోషల్ మీడియాలో చెలరేగిన వారిని అరెస్టు చేస్తున్న పోలీసులు వారికి బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటు న్నారు. మరోవైపు.. వేట మరింత ముమ్మరంగా సాగుతోంది. దీంతో చాలా మంది నాయకులు బయటకు రాకుండా తప్పుకొంటున్నారు. ఇది ఒకవైపు వైసీపీని ఇరకాటంలోకి నెడితే.. మరోవైపు.. చెట్ల చిక్కులు ఇప్పుడు వారిని వెంటాడుతున్నాయి.
వైసీపీ హయాంలో సీఎం జగన్ ఏ జిల్లాలో పర్యటిస్తే.. ఆ జిల్లాల్లో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించా రు. నాయకులు చెప్పారనో.. లేక, ఉన్నతాధికారుల కనుసన్నల్లో పడి ప్రమోషన్లు కొట్టేయాలనో భావించిన అధికారులు క్షేత్రస్థాయిలో చెట్లను కొట్టేశారు.
చిన్నవనీ లేదు.. పెద్దవనీ లేదు.. వందల సంవత్సరాలున్న చెట్లను కూడా ముఖ్యమంత్రి పర్యటన పేరుతో కొట్టేశారు. అప్పట్లోనే రాజకీయంగా ఈ వ్యవహారం దుమారం రేపింది. మీడియాలోనూ ప్రముఖంగా వచ్చింది.
అయితే.. వైసీపీ నాయకులు లైట్ తీసుకున్నారు. నిజానికి ఏ ప్రభుత్వమైనా.. చెట్లు నాటాలని కోరుతుంది. కానీ, చిత్రంగా వైసీపీ హయాంలో మాత్రం చెట్లు నరికారే తప్ప.. నాటిని పాపాన పోలేదు. ఇది ప్రకృతి కి ఎంత దుష్ప్రభావం అనేది కూడా ఆలోచించుకోలేక పోయారు. సరే.. ఇప్పుడు దీనిపైనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. దృష్టి పెట్టారు.
వైసీపీ హయాంలో చెట్లు నరికిన ఉదంతంపై ఆయన సీరియస్‌గానే ఉన్నారు. ఆనాడు ఏం జరిగిందో నివేదిక ఇవ్వాలని అటవీ శాఖను ఆదేశించారు.
దీంతో ఇప్పుడు జిల్లాల వారీగా నరికిన చెట్ల సంఖ్య, దీనివెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి..? ఎంత ఖర్చు చేశారు? వంటి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. అనంతరం.. వీటిని ప్రజాసమక్షంలో పెట్టి.. బాధ్యులైన వైసీపీ నాయకులపై వాల్టా చట్టం(ప్రకృతి సంపదను పరిరక్షించుకునే) కింద కేసులు పెట్టనున్నారు. దీని ప్రకారం అయితే.. అసలు బెయిల్ కూడా రాదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. ఎక్కువగా ఈ కేసులు అధికారుల మెడకు చుట్టుకుంటాయని తెలుస్తోంది. ఎందుకంటే.. వాల్టా చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత కలెక్టర్‌పైనే ఉంటుంది.