ఏపీ అసెంబ్లీ సమావేశాలను సజావుగా నడిపించేందుకు ప్రయత్నిస్తున్నామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభకు రాని వారి సంగతి ఏం చేయాలనే విషయాన్ని చట్టానికి వదిలి పెట్టనున్నట్టు తెలిపారు. జగన్ ఒక్కడు ఒకవైపు.. ప్రజలంతా మావైపు ఉన్నారు. దీనిని బట్టి.. ఏం చేయాలనే విషయాన్ని చట్టం ప్రకారం ఆలోచించి నిర్ణయిస్తాం
అని సభకు రాకుండా ఉన్న వైసీపీ ఎమ్మెల్యేల విషయంపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సభలో ఉన్నవారికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలో సభా సంఖ్యా బలాన్ని ప్రాధాన్యంగా తీసుకుంటామన్నారు.
ఇది అన్ని సభల్లోనూ ఉన్నదేనని చెప్పారు. కొత్తగా మాకు రూల్స్ ఉండవు. సభలో ఎవరెవరికి ఎంతెంత సమయం ఇవ్వాల నేది రూల్స్ ఉన్నాయి. వాటి ప్రకారం నడుచుకుంటాం. మేం కొత్తగా రూల్స్ సృష్టించేది లేదు. సభకు రావాలని ప్రతిపక్ష నేతను గతంలోనే విన్నవించాను. ఇప్పుడు కూడా మా అధికారులు రెండు సార్లు సమాచారం అందించారు. దీనిలో మా వైపు ఎలాంటి తప్పులేదు. అసలు సభకే రాకుండా .. మైకు ఇవ్వాలంటే.. ఎలా?
అని అయ్యన్న ప్రశ్నించారు. సభకు వచ్చిన వారు.. ప్రజల తరఫున మాట్లాడతామంటే.. మైకు ఇచ్చేందుకు మేం సిద్ధంగానే ఉన్నామన్నారు.
ఇక, ప్రస్తుత ఎమ్మెల్యేల్లో చాలా మంది కొత్తవారు ఉన్నారని చెప్పిన అయ్యన్న.. వారికి ఆదివారం , సోమవారం ఉదయం వరకు కూడా.. శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. ముఖ్యంగా బడ్జెట్‌లో ని అనేక అంశాలు క్లిష్టంగా ఉంటాయని… వాటిని తెలుసుకునేం దుకు ఎమ్మెల్యేలకు సమయం పడుతుందన్నారు. ఇలాంటి సమయంలో వారికి బడ్జెట్ ప్రసంగంపైనా బడ్జెట్‌లోని అంశాలపై వివరణ ఇచ్చేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనికి అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఇక, కూటమి పార్టీల ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి.. కొత్తవారు ఎలా మాట్లాడాలో చెబుతామన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలను కీలకమైనవి పేర్కొన్న స్పీకర్ అయ్యన్న.. ఈ సమావేశాలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేస్తా యన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించేందుకు ప్రభుత్వం ముఖ్యంగా సీఎం చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. బడ్జెట్ బాగుందనేది తన వ్యక్తిగతఅభిప్రాయంగా వెల్లడించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని.. వాటిని తాను తప్పుబట్టనని చెప్పారు. అయితే.. ప్రస్తుతం వచ్చే ఐదుమాసాలకు మాత్రమే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన నేపథ్యంలో దీనిలో పేర్కొన్న అన్ని విషయాలు బాగానే ఉన్నాయని భావిస్తున్నట్టు చెప్పారు. ఇది సంక్షేమ, అభివృద్ధి బడ్జెట్ అని వ్యాఖ్యానించారు.