ఏపీలోని కూటమి ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలి ఉన్న ఐదు నెలల కాలానికి సంబంధించిన బడ్జెట్‌ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఈ బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఆయన గత వైసీపీ సర్కారు నిర్వాకాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్ర ఆదాయానికి, చేసిన అప్పులకు పొంతన లేకుండా పోయిందన్నారు. పరిమితికి మించి చేసిన అప్పులు కారణంగా.. రాష్ట్రం ఇబ్బందుల్లో పడిందన్నారు.
“ఏ ప్రభుత్వానికైనా ఐదేళ్ల కాలపరిమితి ఉంటుంది. కానీ,గత ప్రభుత్వం 25 సంవత్సరాలకు సరిపోయేలా అప్పులు చేసింది. తద్వారా.. ఆదాయాన్ని తగ్గిచేసింది. ఇది అత్యంత లోప భూయిష్ట విధానంగా నిపుణులు చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగించేలా వ్యవహరించింది” అని పయ్యావుల తన ప్రసంగం లో పేర్కొన్నారు. ఈ పరిస్థితిని అంచనా వేసుకునేందుకు తమకు సమయం పట్టిందన్నారు. అందుకే కొంత ఆలస్యమైనా పరిపూర్ణమైన బడ్జెట్‌ను తీసుకువచ్చామని చెప్పారు.
ప్రస్తుతం ప్రవేశ పెడుతున్న బడ్జెట్.. రాష్ట్రాన్ని కాపాడడంతో పాటు, సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంతో ముందుకు తీసుకువెళ్లనుందని మంత్రి పయ్యావుల తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి సమ్మేళనంగా 2024–25 వార్షిక బడ్జెట్ ను వండివార్చామన్నారు. ప్రాధాన్య రంగాలతోపాటు ప్రజల ఆరోగ్యం, సమాజ శాంతి భద్రతలు, యువతకు ఉపాధికల్పన, ఉద్యోగాలకు పెద్ద పీట వేశామని అన్నారు. అదేవిధంగా రైతులేనిదే రాజ్యం లేదని నమ్మే చంద్రబాబు ఆశలకు అనుగుణంగా వ్యవసాయానికి కూడా ఎక్కువగానే నిధులు ఇచ్చామన్నారు.
దీనికి ముందు..
బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి ముందు.. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా 2024-25(మిగిలిన కాలానికి) వార్షిక బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం.. బడ్జెట్ ప్రతులతో మంత్రి పయ్యావుల అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఇదిలావుంటే.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని ప్రాంతంలోని వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించారు.