కాపు నాయకుడు, మాజీ జర్నలిస్టు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారా? త్వరలోనే ఆయన జాతీయ పార్టీ బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారా? ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాకు చెందిన బీజేపీ ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ చీఫ్ తో ఆయన చర్చలు కూడా పూర్తి చేసుకున్నారా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. వైసీపీ హయాంలో రాజకీయంగా దూకుడు పెంచిన కన్నబాబుకు జగన్ మంత్రి పదవి ఇచ్చారు.
కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి 2019లో విజయం దక్కించుకున్న ఆయన.. తరచుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను టార్గెట్ చేసుకున్నారు. కాపుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ వారి పక్షాన గళం వినిపించారు. ఈ క్రమంలోనే మంత్రి పదవిని దక్కించుకున్నారన్న వాదన కూడా ఉంది. అయితే.. ఈ ఏడాది ఎన్నికల్లో కన్న బాబు ఓడిపోయారు. ఆ తర్వాత.. వైసీపీ నుంచి ఆయనకు ఎలాంటి ఆదరణ లభించలేదు. పైగా.. కాపుల్లోనే ఆయనపై వ్యతిరేకత వచ్చింది.
ఈ పరిణామాలతోపాటు.. పార్టీ కూడా పట్టించుకోకపోవడంతో అన్యమస్కంగా ఉన్న కన్నబాబు.. వైసీపీకి దూరంగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు. ఇదిలావుంటే.. బియ్యం అక్రమరవాణా సహా.. కన్నబాబు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో రైతులకు ఎగ్గొట్టిన ధాన్యం సొమ్ములు, రైతు భరోసా కేంద్రాల నిర్మాణంలో జరిగిన అవినీతి వంటి వాటిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం వెలికి తీస్తోంది.
దీంతో ఇక, వైసీపీలో ఉంటే..తనకు ఇబ్బందులు తప్పవని నిర్ణయించుకున్నట్టు కురసాల గురించి నియోజకవర్గంలో చర్చ సాగుతోంది. మరోవైపు.. బీజేపీ రాష్ట్ర నేతతో ఉన్న పరిచయాల నేపథ్యంలో కన్నబాబు ఆ పార్టీ వైపు అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే వైసీపీకి బలమైన కాపు నాయకుడు దూరం ఖాయంగా కనిపిస్తోంది. ఇక, బీజేపీ విషయానికి వస్తే.. ఈ పార్టీలో అంతర్గతంగా జరుగుతన్న సామాజిక సమీకరణ రాజకీయాల నేపథ్యంలో కన్నబాబుకు రెడ్ కార్పెట్ పరిచే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.