ప్ర‌శంస‌ల‌కు లొంగిపోతున్న మంత్రులు… ఇదే పెద్ద మైన‌స్‌!

నిన్న మొన్న‌టి వ‌ర‌కు త‌న టీంకు తిరుగులేద‌ని చెప్పుకొచ్చిన సీఎం చంద్ర‌బాబు.. ఇప్పుడు అదే మంత్రి వ‌ర్గ బృందంలోని కొంద‌రిపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఎప్పుడు కేబినెట్ భేటీ పెట్టినా.. క్లాస్ ఇస్తున్నార‌నే విష‌యం తెలిసిందే. మ‌రి ఈర‌కంగా ప్ర‌తి 15 – 20 రోజులకు క్లాస్ ఇస్తున్న‌ప్పుడు.. మంత్రుల ప‌రిస్థితి ఏంటి? చంద్ర‌బాబు ఏం చేస్తారు? అనే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌స్తుంది.

ఇప్పుడు జ‌రిగిన కేబినెట్ భేటీలోనూ మంత్రుల‌పై చంద్ర‌బాబు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ప‌నిచేయ‌డం లేద‌ని.. చెప్పుకొచ్చారు. వాస్త‌వానికి త‌న‌తో పోటీ ప‌డాల‌ని.. రాష్ట్రంలో ప్ర‌గ‌తి క‌నిపించాల‌ని గ‌త రెండు కేబినెట్ స‌మావేశాల నుంచి చంద్ర‌బాబు చెబుతున్నారు. అయితే.. మంత్రులు కొంద‌రు వింటున్నారు. మ‌రికొంద‌రు లైట్ తీసుకుంటున్నారు. దీంతో కొన్ని కొన్ని శాఖ‌ల‌పై చంద్ర‌బాబు మార్కు ప‌డ‌డం లేదు.

ఇది.. స‌హ‌జంగా విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరున్న చంద్ర‌బాబుకు ఇబ్బందిగానే ఉంది. దూకుడు లేక‌పోవ‌డం, చొర‌వ తీసుకుని నిర్ణ‌యాలు ప్ర‌క‌టించ‌లేక పోవ‌డం.. వంటివి న‌లుగురి నుంచి ఆరుగురు మంత్రుల‌కు ఇబ్బందిగా మారింది. దీని నుంచి వారు బ‌య‌ట‌కు రాలేక పోతున్నార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి కార‌ణం.. ప్ర‌శంస‌లు, పొగ‌డ్త‌ల‌కు మంత్రులు ప‌డిపోతున్నార‌న్న వాద‌న కూడా ఉంది.

అధికారంలో ఉన్న‌ప్పుడు ఎదుర‌య్యే ప్ర‌ధాన స‌మ‌స్య ఇదే. మీరు అంత‌టి వారు.. ఇంత‌టి వారు .. అంటూ.. ఉన్న‌తాధికారుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తారు. ఈ వ‌ల‌లో చిక్కుకుపోతుండ‌డం మంత్రుల వీక్ నెస్‌. అయితే.. వారు ఈ వాస‌న‌ల‌ను దూరం పెట్టాల్సిన అవ‌స‌రం ఉంది. రాజ‌కీయ నేత‌ల మాదిరిగా కాకుండా.. మంత్రులుగా వారు బిహేవ్ చేసిన‌ప్పుడు ఈ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డే అవ‌కాశం ఉంది. ఇది లేనంత సేపు.. చేతులు కాళ్లను ప్ర‌శంస‌ల‌నే తాళ్ల‌తో క‌ట్టేసే వారే ఎక్కువ‌గా ఉంటార‌న్న విష‌యాన్ని వారు గుర్తించాలి.