జ‌లీల్‌ఖాన్ ఎంత పని చేసావయ్యా..

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో చెప్ప‌డం క‌ష్టం. ఏదో ఉద్ధ‌రించేస్తారు. అని భావించిన నాయ‌కులు కూడా త‌ర్వాత కాలంలో చ‌తికిల‌ప‌డిన ప‌రిస్థితి స్ప‌ష్టంగా క‌నిపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ప‌రిస్థితే.. విజ‌య‌వాడలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం ప‌శ్చిమ‌లో టీడీపీ ఎదుర్కొంటోంది.

విజ‌య‌వాడ‌లో మూడు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. పశ్చిమ‌, తూర్పు, సెంట్ర‌ల్‌. అయితే, ఒక్క ప‌శ్చిమ‌లో త‌ప్ప‌.. మిగిలిన రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ టీడీపీకి ప‌ట్టుంది. ఇక్క‌డ‌చిత్రం ఏంటంటే.. రాష్ట్రంలో టీడీపీ పుట్టిన త‌ర్వాత ప‌శ్చిమ‌లో ఇప్ప‌టి వ‌ర‌కు గెలుపు గుర్రం ఎక్క‌లేదు.

అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీకి అందివ‌చ్చిన నాయ‌కుడు అవుతార‌ని భావించిన చంద్ర‌బాబు.. 2014లో వైసీపీ త‌ర‌ఫున విజ‌యం సాధించిన జ‌లీల్‌ఖాన్‌ను పార్టీలోకి చేర్చుకున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌కు మైనార్టీ మంత్రి ప‌ద‌వి ఇస్తార‌ని అనుకున్నా.. త‌ర్వాత ఆయ‌నకు వ‌క్ఫ్ బోర్డు చైర్మ‌న్‌గా నియ‌మించారు.

అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్ త‌న కుమార్తెకు అవ‌కాశం ఇవ్వాల‌ని చంద్ర‌బాబు కోర‌డం, దీనిని ఆయ‌న ఓకే చెప్ప‌డంతో ష‌బానా ఖ‌తూన్ పోటీ చేశారు. గ‌ట్టిపోటీనే ఇచ్చినా.. వైసీపీ నాయ‌కుడు వెలంప‌ల్లి శ్రీనివాస్‌పై ప‌రాజ‌యం పాల‌య్యారు.

నిజానికి జ‌లీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇవ్వ‌డం టీడీపీలోని ఓ వ‌ర్గానికి సుత‌రామూ ఇష్టం లేదు. మ‌రీ ముఖ్యంగా ఇక్క‌డ కీల‌కంగా ఉన్న నాగుల్ మీరాకు అస్స‌లు ఇష్టం లేదు. ఈ ప‌రిణామం.. ఎన్నిక‌ల్లో జ‌లీల్ ఖాన్‌కు త‌మ్ముళ్లు క‌లిసిరాకుండా చేసింది. ఇక‌, ఓట‌మి త‌ర్వాత ష‌బానా.. అమెరికా వెళ్లిపోయారు. అప్ప‌టి నుంచి అనారోగ్య కార‌ణాలతో జ‌లీల్ ఖాన్ కూడా పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగానే ఉంటున్నారు.

మ‌రోవైపు అప్ప‌టి వ‌ర‌కు యాక్టివ్‌గా ఉన్న నాగుల్ మీరా వ‌ర్గం కూడా చంద్ర‌బాబు టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతో పార్టీ కార్య‌క్ర‌మాల‌కు దూరంగానే ఉంటోంది. దీంతో ఏదో జ‌రిగిపోయి.. ఇక్క‌డ పార్టీ బ‌ల‌ప‌డుతుంద‌ని అనుకున్న చంద్ర‌బాబు వ్యూహం రెంటికీ చెడ్డ రేవ‌డిగా మారిపోయింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇప్పుడు పార్టీలో జెండా మోసే నాథుడు కూడా క‌నిపించ‌డం లేదు. మ‌రి మున్ముందు ఏం జ‌రుగుతుందో చూడాలి.