పంచ్ ప్రభాకర్.. ఈ పేరు గత వైసీపీ హయాంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. అమెరికా, భారత్‌లోనూ పెద్ద ఎత్తున వినిపించింది. హైకోర్టులోనూ కేసులు విచారణ పరిధిలో ఉన్నాయి. అయితే.. అప్పట్లో వైసీపీ అండతో ఆయన తప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు మాత్రం కూటమి సర్కారు కన్నెర్ర చేస్తోంది. దీంతో పంచ్ ప్రభాకర్‌కు పంచ్ పడే సమయం వచ్చేసిందనే చర్చ జరుగుతోంది. ఎక్కడున్నా ప్రభాకర్‌ను ఏపీకి తీసుకువస్తామని.. డీజీపీ ద్వారకా తిరుమల రావు చెప్పడం గమనార్హం.
ఏంటి రగడ!
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడం వేరు. అదేసమయంలో సోషల్ మీడియాను అడ్డు పెట్టుకుని.. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో రెచ్చిపోవడం వేరు. నోటికి పనిచెప్పడం వేరు. ఈ రెండే ఇప్పుడు పంచ్ ప్రభాకర్‌ను తీవ్ర వివాదంలోకి నెట్టాయి. సోషల్ మీడియాలో చేసే పోస్టులు ఆలోచింప చేసేవిలా ఉండాలి. నలుగురికి ప్రయోజనకరంగా.. ప్రభుత్వం కూడా సదరు సూచనలు పాటిస్తే బాగుండేదేమో అని అనిపించేలా ఉండాలి.
కానీ, పంచ్ ప్రభాకర్ మాత్రం నోరు విప్పితే.. అమ్మనా.. బూతులతో విరుచుకుపడేవారు. “హాయ్ హలో.. మీ పంచ్‌ప్రభాకర్” అని ప్రారంభించే ఆయన సోషల్ మీడియా పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉంటాయి. నోటికి ఏ మాట వస్తే ఆమాట.. ఎంత బూతు పదం వస్తే అంత బూతుపదం.. నిర్లజ్జగా మాట్లాడేసి.. సోషల్ మీడియాను కంపు కంపు చేసిన ఘనత పంచ్ ప్రభాకర్‌కే దక్కుతుంది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబును దూషించిన తీరు నిజంగానే చంద్రబాబును తీవ్రంగా వ్యతిరేకించేవారు కూడా.. హర్షించలేనంతగా ఉంటాయంటే ఆశ్చర్యం ఏమీలేదు.
నారా లోకేష్, పవన్ కల్యాణ్ సహా.. మహిళా నాయకుల నుంచి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, బాలయ్య సతీమణి వసుంధర వరకు.. ఎవరినీ వదిలి పెట్టకుండా.. బూతులు తిట్టిన పంచ్ ప్రభాకర్ పై తాజాగా విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. గతంలో హైకోర్టు న్యాయమూర్తు లను దూషించిన కేసులు ఇప్పటికే పెండింగులో ఉన్నాయి. అమెరికాలో ఉంటూ.. ప్రభాకర్ చేసిన ఈ వికృత చేష్ఠలను అరికట్టేందుకు నేడో రేపో.. పోలీసులు అమెరికాకు వెళ్లనున్నట్టు తెలిసింది. మొత్తానికి ప్రభాకర్‌ను ఏపీకి తీసుకువచ్చి.. శిక్షించేందుకు ప్రభుత్వం రెడీ కావడం గమనార్హం.