ఫైర్ బ్రాండు నగిరి ఎంఎల్ఏకు పోటిగా నియోజకవర్గంలో మరో పవర్ సెంటర్ మొదలవుతోందా ? క్షేత్రస్ధయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే పార్టీలో ఇదే అనుమానాలు పెరుగుతున్నాయి. నగిరి మున్సిపల్ మాజీ ఛైర్ పర్సన్ గా పనిచేసిన కేజే శాంతికి తొందరలో కీలక పదవి దక్కనున్నట్లు సమాచారం. శాంతి భర్త కేజే కుమార్ కూడా మున్సిపల్ ఛైర్మన్ గా పనిచేసిన నేతే. వీళ్ళకు నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఒకపుడు ఎంఎల్ఏ రోజాతో మంచి సఖ్యతగా ఉన్న ఈ కుటుంబం కొంతకాలంగా పూర్తి వ్యతిరేకంగా పనిచేస్తోంది. కుమార్ దంపతులు, రోజా మధ్య సంబంధాలు ప్రస్తుతం ఉప్పు-నిప్పుగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇటువంటి శాంతికి బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్ నియామకాల్లో భాగంగా ఓ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కనున్నట్లు సమాచారం. ప్రభుత్వం నియమించనున్న 56 కార్పొరేషన్లలో ఈడిగ కార్పొరేషన్ కూడా ఒకటి. ఈడిగ కార్పొరేషన్ కు ఛైర్ పర్సన్ గా శాంతి నియామకం దాదాపు ఫైనల్ అయిపోయినట్లే అని పార్టీలో ప్రచారం జరుగుతోంది. కుమార్, శాంతి దంపతులకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కాని ఎటువంటి పదవులు రాకూడదన్నది రోజా ఆలోచన. అయితే రోజాకు సంబంధం లేకుండానే శాంతి పేరు జగన్మోహన్ రెడ్డి ఫైనల్ చేసినట్లు తెలిసింది.
జిల్లాలో నెలకొన్న రాజకీయ పరిస్దితుల కారణంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈడిగ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గా శాంతిని నియమించాలని సిఫారసు చేశారట. పెద్దిరెడ్డికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మద్దతుగా నిలిచారట. ఎందుకంటే రోజాకు వీళ్ళద్దరితో ఏమాత్రం పడటం లేదు. ఏదన్నా సమావేశాల్లో కలిసినపుడు, సమయం వచ్చినపుడు అందరు కలిసినట్లే ఉంటారు. కానీ లోలోపల మాత్రం వీళ్ళల్లో ఒకళ్ళంటే మరొకళ్ళకు పడటం లేదన్న విషయం పార్టీలో అందరికీ తెలుసు.
ఇందులో భాగంగానే పెద్దిరెడ్డి, నారాయణస్వామితో రోజాకు ఏమాత్రం పడటం లేదు. అందుకనే నగిరి నియోజకవర్గంలో వీళ్ళని పిలిచి కేజే కుమార్ దంపతులు కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంటారు. వీళ్ళ కార్యక్రమాలకు రోజాకు ఆహ్వానం కూడా ఉండదు. రోజాతో పై ఇద్దరికి పడదు కాబట్టి కేజే దంపుతులు ఏర్పాటు చేసే కార్యక్రమాలకు వీళ్ళు కూడా హాజరవుతుంటారు. దీంతో కేజే కుటుంబానికి పార్టీలో మరో బలమైన వర్గం తయారైంది.
ఒకవైపు రోజా తన మద్దతుదారులతో పార్టీ కార్యక్రమాల్లో దూసుకుపోతోంది. ఇదే సమయంలో కేజే దంపతులు కూడా తమ కార్యక్రమాల్లో స్పీడుగా ఉంటున్నారు. అంటే నియోజకవర్గంలో పార్టీలోనే రెండు బలమైన వర్గాలున్న విషయం స్పష్టమైపోయింది. ఇటువంటి నేపధ్యంలోనే శాంతికి కొర్పొరేషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కితే రోజాకు ప్రత్యామ్నాయంగా మరో పవర్ సెంటర్ ఏర్పాటవ్వటం ఖాయమే. మరి దీన్ని ఎంఎల్ఏ ఎలా ఎదుర్కొంటారో చూడాల్సిందే.