ఔను! ప‌వ‌న్ స‌ర్ చెప్పింది నిజ‌మే: ఏపీ డీజీపీ

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌తల విష‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమ‌లరావు స‌మ‌ర్థించారు. “ఔను ప‌వ‌న్ స‌ర్ చెప్పింది నిజ‌మే” అని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌లో(వైసీపీ పాల‌న‌) శాంతి భ‌ద్ర‌త‌లు దిగ‌జారాయ‌ని చెప్పారు. ప్ర‌స్తుతం శాంతి భద్ర‌త‌ల‌ను గాడిలో పెట్టేందుకు తాము శ్ర‌మిస్తున్న‌ట్టు చెప్పారు. గ‌త ఐదేళ్ల‌లో పోలీసులు కూడా గాడి త‌ప్పార‌ని.. ఎవ‌రూ ప‌నిచేయ‌లేద‌ని అందుకే రాష్ట్రంలో అనేక ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయ న్నారు. “భావ ప్ర‌క‌ట‌నా స్వేచ్ఛ‌పేరుతో పార్టీ(టీడీపీ) కార్యాల‌యంపై దాడులు చేయ‌డం స‌మ‌ర్థించ‌లేం” అని వ్యాఖ్యానించారు.

కానీ, గ‌త పోలీసు అధికారులు మాత్రం ఓ పార్టీ(టీడీపీ) కార్యాల‌యంపై జ‌రిగిన దాడిని కూడా స‌మ‌ర్థించుకున్నార‌ని చెప్పారు. ఇలాంటివి చేయ‌డం వ‌ల్లే పోలీసులు ప‌నిచేయ‌లేద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో పోలీసింగ్‌ను దారిలో పెట్టేందుకు చ‌ర్య‌లు తీసుకు న్నామ‌న్నారు. “డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌గారు చెప్పింది వాస్త‌వం. రాష్ట్రంలో గ‌త ఐదేళ్ల‌లో శాంతి భ‌ద్ర‌త‌లు క్షీణించాయి. మ‌హిళ‌లు బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు భ‌యప‌డ్డారు. ఆ ప‌రిస్థితి మార్చాల‌న్న‌ది ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల అంత‌రార్థం. ఈ విష‌యంలో మేం సిద్ధంగా ఉన్నాం. రాష్ట్ర పోలీసు యంత్రాంగం కూడా రెడీగా ఉంది. పరిస్థితిని మారుస్తాం” అని ద్వార‌కా తిరుమ‌ల రావు అన్నారు.

ఇక‌, ఐపీఎస్ అధికారుల‌పై కేసులు న‌మోదు కావ‌డంపైనా ద్వార‌కా తిరుమ‌ల‌రావు స్పందించారు. గ‌తంలో కొంద‌రిపై ఉన్న వ‌త్తళ్ల కార‌ణంగా త‌ప్పులు చేశార‌ని భావిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. త‌ప్పు చేసిన వారు ఎలాంటి వారైనా, ఎంత‌టి వారైనా అరెస్టు చేయ‌క త‌ప్ప‌ద‌ని ఐపీఎస్ విశాల్‌గున్నీ, కాంతి రాణా టాటా, సంజ‌య్ ల‌ను ఉద్దేశించి ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక‌, ప్ర‌స్తుతం సంజ‌య్ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు చెప్పారు. దీనిపై విచార‌ణ జ‌రుగుతోంద‌న్నారు. అదేస‌మ‌యంలో పోలీసుల‌పై వ‌స్తున్న ఫిర్యాదుల‌ను కూడా తీవ్రంగా భావిస్తున్నామ‌ని, చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు.