ఏపీలో శాంతి భద్రతలపై, హోం మంత్రి వంగలపూడి అనితపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తాను హోం శాఖను తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉంటుందని, కొన్ని ఘటనలకు హోం మంత్రి అనిత బాధ్యత వహించాలని పవన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.
ఈ క్రమంలోనే పవన్ వ్యాఖ్యలపై అనిత స్పందించారు. పవన్ కల్యాణ్ అన్నదాంట్లో తప్పేమీ లేదని అనిత చెప్పారు. ఏపీలో శాంతిభద్రతల పరిరక్షణపై సీఎం చంద్రబాబు, పోలీసు ఉన్నతాధికారులతో తాను ఎప్పటికప్పుడు చర్చిస్తున్నానని అనిత అన్నారు.
ఆ చర్చల్లో పవన్ కల్యాణ్ కూడా భాగమేనని చెప్పారు. పవన్ కు అన్ని విషయాలు తెలుసు కాబట్టే మాట్లాడారని అన్నారు. ఆయన ఏ కేసు విషయంలో ఆగ్రహంగా ఉన్నారో తనకు తెలుసని, త్వరలోనే పవన్ తో భేటీ అయ్యి అన్ని విషయాలు మాట్లాడతానని అనిత అన్నారు.
మరోవైపు, అనంతపురం, ఉమ్మడి చిత్తూరు జిల్లాల పోలీస్ అధికారులతో అనిత సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆయా జిల్లాల్లో శాంతి భద్రతల స్థితిగతుల గురించి అనిత ఆరా తీసినట్లు తెలుస్తోంది. తమ విధులను సక్రమంగా నిర్వర్తించి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని పోలీస్ అధికారులకు అనిత సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates