సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వీ రమణకు కీలక పదవి రెడీ అయిందా? ఆయనకు ఈ సారి ఖచ్చితంగా పదవి దక్కుతుందా? అంటే.. టీడీపీ వర్గాలు ఔననే అంటున్నాయి. ఈసారి మాత్రం చంద్రబాబు గురి తప్పదని కూడా చెబుతున్నాయి. మరి ఆ పదవి ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వాస్తవానికి జస్టిస్ ఎన్ వీరమణ పదవీ విరమణ చేసిన తర్వాత.. ఏపీ రాజకీయాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన ఆది నుంచి చంద్రబాబు విజన్ అంటే.. ఇష్టపడుతున్న విషయం తెలిసిందే.
గతం నుంచి కూడా జస్టిస్ ఎన్వీ రమణకు, చంద్రబాబుకు మధ్య అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత.. ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ పదవి దక్కుతుందన్న ప్రచారం హోరెత్తిపోయింది. దీనిపై అనేక చర్చలు కూడా జరిగాయని టీడీపీలోనూ వినిపించింది. కానీ.. తాజాగా నియమించిన బోర్డులో ఆయన పేరు ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు.
అయితే.. దీనికి ముందే.. చంద్రబాబు మరో ఆలోచనతో ఉన్నారన్నది ప్రస్తుతం వినిపిస్తన్న మాట. రాష్ట్రాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో దేశంలోనే తొలి స్థానంలో నిలబెట్టాలని భావిస్తున్న చంద్రబాబు.. ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి(ఏపీఈఆర్‌సీ)ని కీలకంగా భావిస్తున్నారు. ఏపీఆర్ సీ చైర్మన్ పదవిని(కేబినెట్ హోదా) జస్టిస్ ఎన్వీరమణకు ఇవ్వాలన్నది ఆయన మనసులో మాటగా.. పార్టీ నాయకులు చెబుతున్నారు.
వైసీపీ హయాంలో ఏపీఈఆర్‌సీ చైర్మన్‌గా కూడా జస్టిస్ నాగార్జున రెడ్డి వ్యవహరించారు. ఈయన కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కావడం గమనార్హం. ఈ పదవి తాజాగా మంగళవారం ఖాళీ అయింది. జస్టిస్ నాగార్జున రెడ్డి పదవీ కాలం ముగియడంతో(మూడేళ్లు) ఆయన తాజాగా విరమణ చేశారు. ఈ పదవినే జస్టిస్ ఎన్వీ రమణకు ఇవ్వాలని చంద్రబాబు తలపోస్తున్నట్టు సమాచారం. తద్వారా.. తన విజన్‌కు అనుకూలంగా జస్టిస్ రమణ అయితే.. బాగా పనిచేయగలుగుతారని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.