రాజకీయాల్లో తనకు తిరుగులేదని భావించే వైసీపీ అధినేత జగన్.. తన సొంత పార్టీలో అంతా తానే అయి వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆయన చెప్పిందే వేదం. ఆయన చేసిందే శాసనం. అలా ఉన్న వైసీపీలో అనేక మంది ఇమడలేక.. జారిపోయారు. ఎన్నికలకు ముందు కూడా.. అనేక మంది నాయకులు జగన్‌ను బ్రతిమాలారు. తమకు ఎలాంటి ఇబ్బందీ లేదని.. టికెట్లు ఇవ్వాలని కోరారు. అయినా.. ఆయన తన పంథాను వీడలేదు.
దీంతో పదుల సంఖ్యలో నాయకులు అప్పట్లోనే పార్టీకి దూరమయ్యారు. ఇక, పార్టీ పరిస్థితి ఎన్నికల తర్వాత.. ముఖ్యంగా 11 స్థానాలకు పరిమితమయ్యాక.. అనేక మంది నాయకులు జంప్ చేసేశారు. పైగా.. పార్టీ ఇప్పుడు చాలా సంక్లిష్ట సమయాన్ని స్థితిని కూడా ఎదుర్కొంటోంది. ఇలాంటి సమయంలో తన పంతం కోసం పాకులాడితే.. పార్టీకి అసలుకే ఎసరు వస్తుందని అనుకున్నారో..ఏమో.. జగన్ తగ్గడం ప్రారంభించారు.
అది కూడా .. తన సొంత జిల్లా కడపలోనే జగన్ నాలుగు అడుగులు వెనక్కి వేయడం.. తన మాటను కాదన్న వారిని పక్కన కూర్చోబెట్టుకుని మరీ.. వారి మాటలకు తాను కట్టుబడి నిర్ణయం తీసుకోవడం వంటివి వైసీపీలో చర్చగా మారింది. కడపలోని కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గం వైసీపీ ఇన్ చార్జి వ్యవహారం కొన్నాళ్లుగా రాజకీయ మలుపులు తిరుగుతోంది. ఈ నియోజకవర్గం బాధ్యతలను తమకంటే తమకే ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి పట్టుబడుతున్నారు.
దీంతో ఈ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీనిపై తేలిస్తే తప్ప.. తాము పనిచేసేది లేదనివారు చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సమస్య పరిష్కారానికి స్థానిక నేతలతో పాటు జిల్లా నేతలతో జగన్ సుదీర్ఘంగా చర్చించారు. అయినా.. ఎవరి పంతం వారిదే అన్నట్టుగా పరిస్థితి మారింది. నిజానికి జగన్ చెప్పినట్టు గతంలో నాయకులు వినేవారు. కానీ, ఇప్పుడు వారు చెప్పినట్టు జగన్ వినాల్సి వచ్చింది.
దీంతో మూడు మండలాలకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మరో మూడు మండలాలకు రామసుబ్బారెడ్డి ఇన్‌చార్జ్ లుగా వ్యవహరించాలని జగన్ చెప్పారు. ఇది ఒకరకంగా తన నిర్ణయాన్ని తానే వెనక్కి తీసుకుని.. నాయకుల నిర్ణయానికి కట్టుబడి నట్టు అయింది. ఇలా.. గతంలో ఎప్పుడూ లేకపోవడం.. వైసీపీ అధినేత తొలిసారినాలుగు అడుగులు వెనక్కి వేయడం, అది కూడా తన సొంత జిల్లాలోనే ఇలా జరగడం వైసీపీలో చర్చనీయాంశంగా మారింది.