వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంలో ఆయన తనయ, కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల మరోసారి స్పందించారు. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న కుట్రతోనే సరస్వతి పవర్‌కు సంబంధించిన షేర్లను బదలాయించుకునే కుట్ర చేస్తున్నారన్న వైసీపీ నేతల వాదనకు ఆమె గట్టిగా సమాధానం చెప్పారు. సరస్వతి షేర్లు బదలాయిస్తే.. జగన్ బెయిల్ రద్దువుతుందో.. లేదో.. మా అమ్మకు తెలీదా? అని ఆమె ప్రశ్నించారు.
ఇదంతా జగన్నాటకంలో ఒక భాగమని అర్ధమవుతోందన్నారు. జగన్ బెయిల్ రద్దుకు కుట్ర చేశామని చెప్పడం.. పెద్ద జోక్‌గా ఆమె అభివర్ణించారు. మరోసారి ఆమె గతం తాలూకు విషయాన్ని వెల్లడించారు. జగన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టరేట్ అటాచ్ చేసింది.. షేర్లు కాదన్నారు. కేవలం 32 కోట్ల రూపాయల విలువైన సరస్వతి ఆస్తులను మాత్రమేనని చెప్పారు. షేర్లను బదలాయిస్తే.. ఎలాంటి ఇబ్బందులు రావని, దీనిని ఈడీ కట్టడి చేయలేదని స్పష్టం చేశారు.
“గతంలోనూ ఎన్నో కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వాటికి స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్, బదిలీలు మాత్రం ఆపలేదు” అని షర్మిల పేర్కొన్నారు. ఒక వేళ ఈడీ అటాచ్‌లో ఉన్న షేర్లను బదిలీ చేస్తే.. బెయిల్ రద్దు అవుతుందని తెలిసిన పెద్ద మనిషి (జగన్) ఎంవోయూపై ఎలా సంతకం చేశారని షర్మిల నిలదీశారు. “2021లో 42 కోట్ల రూపాయలకు క్లాసిక్ రియాలిటీ, సండూర్, సరస్వతి షేర్లను విజయమ్మకు ఎలా అమ్మారు?” అని షర్మిల ప్రశ్నించారు.
ఇలా విక్రయించడం మీరు చెబుతున్న ‘స్టేటస్ కో’ను ఉల్లంఘించినట్లు కాదా? అని నిలదీశారు. ఎలా చేసినా.. జగన్ బెయిల్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదన్న విషయం కొందరికి తెలిసినా తెలియకపోయినా.. విజయమ్మకు బాగానే తెలుసునని షర్మిల పేర్కొన్నారు. కాగా, ఈ వ్యవహారంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates