వైసీపీ నేతల నుంచి తమ నాయకురాలికి ప్రాణ హాని ఉందని.. ఈ నేపథ్యంలో మరింత భద్రత కల్పించాలని ఏపీసీసీ చీఫ్ షర్మిల విషయంలో ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ ద్వారకా తిరుమల రావుకు వారు లేఖ రాశారు. అదేవిధంగా ఈ లేఖను ప్రతినిధి బృందం డీజీపీకి అందించింది. ప్రస్తుతం షర్మిలకు పార్టీ అధ్యక్షురాలి హోదాతోపాటు.. మాజీ ముఖ్యమంత్రి కుమార్తెగా 2+2 చొప్పున భద్రత కల్పిస్తున్నారు.
అయితే.. ప్రస్తుతం ఆమె తమ కుటుంబ ఆస్తుల విషయంలో సోదరుడు, వైసీపీ అధినేత జగన్‌తో వివాదానికి దిగిన విషయం తెలిసిందే. వైసీపీ నాయకులు షర్మిలదే తప్పని చెబుతున్నారు. విజయసాయి రెడ్డి నుంచి సుబ్బారెడ్డి వరకు అందరూ ఇదే మాటపై ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి షర్మిలకు సెగ తగులుతోంది. మరోవైపు వైసీపీ సోషల్ మీడియాలోనూ.. షర్మిలకు వ్యతిరేకంగా కామెంట్లు వస్తున్నాయి.
ఇలాంటి సమయంలో షర్మిలకు భద్రత పెంచాలన్నది ఏపీ కాంగ్రెస్ నాయకుల డిమాండ్. షర్మిలకు ప్రస్తుతం ఉన్న 2+2 గన్ మెన్‌కు బదులు 4+4 గన్ మెన్‌ను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై డీజీపీ సానుకూలంగా స్పందించినట్టు పార్టీ నాయకులు తెలిపారు. అయితే.. ఈ విషయం ప్రభుత్వానికి విన్నవించిన తర్వాత డీజీపీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.
ఇక, తెలంగాణలోనూ తన భద్రతను యథతథంగా కొనసాగించాలని షర్మిల కోరుతున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి సర్కారుకు లేఖ సంధించారు. షర్మిలకు ప్రస్తుతం `వై“కేటగిరీ భద్రత ఉంది. దీనిని ఆమె ఎక్కడకు వెళ్లినా.. కొనసాగించాలని సర్కారుకు విన్నవించడం గమనార్హం. ప్రస్తుత పరిణామాలను వారు లేఖలో వివరించారు.