ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తాంబూలాలిచ్చేశారు. ఇక, తేల్చుకోవాల్సింది .. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగనే. వచ్చే నెల 11 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం నిర్ణయించారు.
ఈ సమావేశాల్లోనే (నవంబరు-మార్చి) బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వచ్చే ఐదు మాసాలకు సంబంధించి ఇది కీలకమైన బడ్జెట్. ప్రభుత్వం ప్రకటిస్తున్న విజన్-2047 సాకారానికి సంబంధించిన అనేక అంశాలను దీనిలో ప్రకటించే అవకాశం ఉంది.
అదేవిధంగా అందరూ ఎదురు చూస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు కూడా నిధులు ఈ బడ్జెట్లోనే కేటా యించే వీలుంది. మొత్తంగా చూస్తే.. ఈ సమావేశాలు కూటమి సర్కారుకు అత్యంత కీలకంగా మారను న్నాయి.
ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు జగన్ ఈ సభలకు వెళ్తారా? లేదా? అన్నది ప్రధానంగా చర్చకు వస్తోంది. ఇప్పటి వరకు రెండు సార్లు సమావేశాలు జరిగినా.. తొలిరోజు వెళ్లి వచ్చేయడం తప్ప.. జగన్ చేసింది ఏమీలేదు.
తమకు ప్రధాన ప్రతిపక్షం హోదా ఇవ్వాలన్న మంకు పట్టుతోనే జగన్ వ్యవహరిస్తున్నారు. దీనిపై హైకో ర్టు కూడా వెళ్లారు. ఇలాంటి కేసులు అంత త్వరగా తేలే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో ఆ కేసు తేలే వరకు సభకు వెళ్లేది లేదని జగన్ భీష్మించుకుని కూర్చుంటారా? లేక.. ముందుకు సాగుతారా? అనేది చూడాలి.
ప్రస్తుతం ఆయన బయటకు వచ్చి.. అప్పుడప్పుడు.. ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అధికార పక్షం నాయకులు మీరు చెప్పాలని అనుకున్నది సభకు వచ్చి చెబితే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.
ఇది కూడా వాస్తవమే. ఒక మాజీ ముఖ్యమంత్రిగా సభకు రావాల్సిన అవసరం ఉంది. పైగా.. స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కూడా.. సభకు రావాలనే కోరుతున్నారు. వస్తే మైకు ఇస్తామని కూడా చెబుతున్నారు.
కాబట్టి.. కీలకమైన బడ్జట్ సమావేశాలకు జగన్ హాజరై.. ప్రజల సమస్యలను అక్కడ ప్రశ్నించడం ద్వారా.. ఇటు ప్రజలకు మేలు చేయడంతోపాటు.. పార్టీపరంగా ఆయన కూడా పుంజుకునేందుకు అవకాశం ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates