నవ్వుల రారాజుగా తెలుగు తెరపై ఓ వెలుగు వెలిగిన బాబూ మోహన్.. రాజకీయంగా మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. తొలినాళ్లలో తెలుగు దేశం పార్టీతో ప్రస్తానం ప్రారంభించి న బాబూ మోహన్ మంత్రిగా కూడా పనిచేశారు. తర్వాత.. రాష్ట్ర విభజన తర్వాత.. బీఆర్ఎస్‌లో చేరారు. ఇక్కడ ఇమడలేక.. బీజేపీ బాట పట్టారు. తర్వాత.. కేఏ పాల్ చెంతకు కూడా వెళ్లారు. అయితే.. ఎక్కడా ఆయన నికరమైన రాజకీయాలు చేయలేక పోయారు.
ఈ నేపథ్యంలో తనకు రాజకీయం ఉన్నతిని కల్పించిన చంద్రబాబు చెంతకే చేరిపోయారు. తాజాగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవానికి ఆయన ప్రస్తానం టీడీపీతోనే ప్రారంభైన విషయం తెలిసిందే. ఇక, తెలంగాణలో పార్టీని డెవలప్ చేయాలని భావిస్తున్న చంద్రబాబు.. ప్రజలకు పరిచయం ఉన్న ఫేసులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగానే బాబూ మోహన్‌ను కూడా పార్టీ లోకి తీసుకున్నారు. ఆయనకు త్వరలోనే పార్టీలో ప్రధాన కార్యదర్శి పోస్టును ఇచ్చే అవకాశం ఉంది.
రాజకీయంగా బాబూ మోహన్‌పై ఎలాంటి ఆరోపణలు లేవు. అయితే..కేడర్‌ను నిలబెట్టుకోవడంలోనూ నిర్మాణం చేయడంలోనూ ఆయన విఫలమయ్యారు. దీంతో రెండు సార్లు ఆయన ఓడిపోయారు. గతంలో ఆందోల్ నియోజకవర్గం నుంచి విజయం దక్కించుకున్న బాబూ మోహన్.. చంద్రబాబు సర్కారులోనే కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అవినీతికి దూరంగా ఉన్నా.. నాయకత్వ లక్షణాల విషయంలో ఆయన వెనుక బడ్డారు.
అయితే.. చంద్రబాబుకు నమ్మిన నాయకుడు కావడం, విధేయతతో కూడిన వినయం ఉండడంతో మరో సారి చంద్రబాబు ఆయనకు అవకాశం ఇచ్చారు. చిత్రం ఏంటంటే.. బాబూ మోహన్ తనయుడు బీజేపీలో ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు ఈ ఏడాది పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీ టికెట్ కూడా ఇచ్చింది. ఇది నచ్చకే బాబూ మోహన్ బీజేపీ నుంచి బయటకు వచ్చి పాల్ పంచన చేరి.. పోటీ కూడా చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates