ష‌ర్మిల ఎఫెక్ట్‌: జ‌గ‌న్‌కు వైఎస్ సానుభూతి ప‌రుల గుడ్ బై!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రూ చెప్ప‌లేరు. ముఖ్యంగా సెంటిమెంటును ప్ర‌ధానంగా న‌మ్ముకుని రాజ‌కీయాలు చేసేవారు.. ఆ సెంటిమెంటు కొండ‌లు క‌రిగిపోతే ఓర్చుకోలేరు. వారివారి మార్గాలను వారు చూసుకుంటారు. ఎందుకంటే.. ఏ నాయ‌కుడికైనా. ఏ పార్టీకైనా.. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నా.. సెంటిమెంటే ప్ర‌ధాన బ‌లం. ఇప్పుడు ఈసెంటిమెంటు వైసీపీకి ప్ర‌మాదంగా మారింది. ఒక‌ప్పుడు ప్ర‌మోదంగా ఉన్న ఈ సెంటిమెంటు.. ఇప్పుడు వైసీపీలో క‌రిగిపోతోంది.

ష‌ర్మిల ఆస్తుల వివాదం తెర‌మీదికి రావ‌డం.. ఆమె మీడియా ముందు క‌న్నీరు పెట్ట‌డం.. వంటి ఘ‌ట‌నల అనంత‌రం.. వైఎస్ సానుభూతి అనే పెద్ద పునాదుల‌పై ఏర్ప‌డిన వైసీపీకి బీట‌లు ప‌డుతున్నాయి. సానుభూతి క‌రిగిపోతోంది. దీంతో వైఎస్‌ను చూసి.. ఆయ‌న కుమారుడిగా జ‌గ‌న్ చెంత‌కు చేరిన నాయ‌కులు చాలా మంది ఇప్పుడు ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డ్డారు. ఆస్తులు పోతో సంపాయించుకోవ‌చ్చు. ప‌ద‌వులు పోయినా.. సంపాయించుకోవ‌చ్చు. కానీ, ప్ర‌జ‌ల్లో సానుభూతి పోతే.. తిరిగి సంపాయించుకోవ‌డం ఈజీకాదు.

ఇదే కోణంలో ఆలోచిస్తున్న వైసీపీ సీనియ‌ర్లు కొంద‌రు.. ఇప్పుడు జ‌గ‌న్‌కు గుడ్ బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత విధేయులుగా ఉండి.. త‌ర్వాత కాలంలో జ‌గ‌న్‌ను అనుస‌రించిన వారు.. వైఎస్ సెంటిమెంటుతోనే రాజ‌కీయాలు కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టికీ వారు వైఎస్ సానుభూతి ప‌రులుగానే ఉన్నారు. కానీ, ఇప్పుడు వైఎస్ సానుభూతి వ్య‌వ‌హారం పెద్ద చ‌ర్చ‌గా మార‌డంతో వారు త‌మ దారి తాము చూసుకుంటున్నారు.

తాజాగా ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాకు చెందిన వైఎస్ అనుచ‌రుడిగా గుర్తింపు పొందిన మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్ప‌నున్న‌ట్టు తెలిసింది. తాజా ప‌రిణామాల‌తో ఆయ‌న విసుగు చెందార‌ని.. ష‌ర్మిలకు అన్యాయం చేస్తున్నార‌న్న వాద‌న‌ను బ‌లంగా విశ్వ‌సిస్తున్నార‌ని.. ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నా రు. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ ద‌గ్గ‌ర ఇక‌, రాజ‌కీయాలు చేయ‌లేన‌ని ఆయ‌న తీర్మానించుకున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లోనే ఆయ‌న టీడీపీ చెంత‌కు చేర‌నున్న‌ట్టు తెలిసింది.

కందుకూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లు మార్లు విజ‌యం ద‌క్కించుకున్న మ‌హీధ‌ర్‌రెడ్డి.. వైసీపీ హ‌యాంలో మంత్రి ప‌ద‌విని కోరుకున్నారు. కానీ, జ‌గ‌న్ దీనికి అంగీక‌రించ‌లేదు. అంతేకాదు.. ఈ ఏడాది ఎన్నిక‌ల‌లో ఆయ‌న‌కు టికెట్ కూడా ఇవ్వ‌లేదు. అయినా.. స‌ర్దుకుపోయారు. కానీ, తాజాగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల కు అన్యాయం జ‌రుగుతున్నద‌న్న ఆవేద‌న‌తో పాటు వైఎస్ సెంటిమెంటు కూడా వైసీపీకి దూర‌మ‌వుతోంద‌ని గ్ర‌హించిన మానుగుంట పార్టీకి రాం రాం చెప్పేందుకు రెడీ కావ‌డం గ‌మ‌నార్హం.