ఇది చక్కదిద్దాలంటే YSR దిగి రావాలి

వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జీవించి ఉన్న స‌మ‌యంలో గ‌డ‌ప దాటి ఎరుగ‌ని కుటుంబ స‌భ్యులు ఇప్పుడు ఏకంగా రోడ్డునే ప‌డ్డారు. ఎవ‌రు బ‌య‌ట‌కు లాగారు? ఎవ‌రు రోడ్డెక్కించార‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. మొత్తంగా నాలుగు మాసాల కింద‌ట రాజ‌కీయంగా వీధిన ప‌డితే.. ఇప్పుడు ఆస్తుల ప‌రంగా వీధి పోరాటాల‌కు దిగారు.

ఈ త‌ర‌హా ప‌రిస్థితిని బ‌హుశ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఎప్పుడూ ఊహించి ఉండ‌రు. ఎందుకంటే.. ఆయ‌న జీవితంలో అనేక మంది వివాదాల‌ను సెటిల్ చేశార‌నే పేరుంది. మాజీ పీసీసీ చీఫ్ ర‌ఘువీరారెడ్డి కుటుంబంలో త‌గాదాలు వ‌స్తే.. గుట్టు చ‌ప్పుడు కాకుండా స‌ర్దుబాటు చేసింది వైఎస్సేన‌ని ఒక సంద‌ర్భంలో ఆయ‌న చెప్పుకొన్నా రు.

అదేవిధంగా క‌నుమూరి బాపిరాజు, ప‌ర్వ‌త‌నేని ఉపేంద్ర‌ల కుటుంబ వ్య‌వ‌హారాల‌ను కూడా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌ర్దుబాటు చేశార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతాయి. ఇక‌, ఎంతో పెద్ద కుటుంబం అయిన వైఎస్ ఫ్యామిలీ(రాజారెడ్డి పిల్ల‌లు)లో ఆస్తుల వివాదాలు.. పంప‌కాలు వంటివి మూడో కంటికి తెలియ‌కుండా సాగిపోయాయంటే.. పెద్ద‌న్న‌గా రాజ‌శేఖ‌ర‌రెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు ను స్ప‌ష్టం చేసింది.

కొన్నాళ్ల కింద‌ట వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి, వివేకానంద‌రెడ్డిల ఏకైక‌ సోద‌రి విమ‌ల‌మ్మ ఇదే చెప్పుకొచ్చారు. త‌మ కుటుంబంలో ఎప్పుడూ పొర‌పొచ్చాలు రాలేద‌ని.. ప్ర‌తి విష‌యాన్నీ ఎంతో జాగ్ర‌త్త‌గా కూర్చుని చ‌ర్చించుకుని ప‌రిష్క‌రించుకు న్నార‌ని ఆమె చెప్పుకొచ్చారు.

అందుకే.. అంత పెద్ద కుటుంబంలో.. ఎన్ని ఆస్తులు ఉన్నాయో.. ఎవ‌రెవ‌రికి ఏమేం పంచుకున్నారో.. కూడా మూడో వ్య‌క్తికి తెలియ‌నంత‌గా వైఎస్ కుటుంబం జాగ్ర‌త్త ప‌డింది. కానీ, ఇప్పుడు అనూహ్య ప‌రిణామాలకు రాజ‌కీయ వివాదాలు, విభేదాలు, క‌క్ష‌లు తోడై.. వైఎస్ కుటుంబం న‌డిరోడ్డున ప‌డి న‌గుబాటు అవుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది.

ప్ర‌స్తుతం జ‌రుగుతున్న వివాదాలు.. మీడియాకు హైప్ కావొచ్చు.. లేదా ఓ వ‌ర్గం రాజ‌కీయ నేత‌ల‌కు విందు కూడా కావొచ్చు. కానీ, ఎంతో గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రించిన వైఎస్ కుటుంబానికి వ‌న్నె తీసుకురాబోవ‌న్న‌ది వాస్త‌వం. అంతేకాదు.. వైఎస్ అంటే క‌ర‌డుగ‌ట్టిన అభిమానం ఉన్న పెద్ద‌లు కూడా ఎటూ తేల్చుకోలేని ప‌రిస్థితిని ప్ర‌స్తుత వివాదం క‌ల్పించ‌డం మ‌రో విష‌యం.

వెర‌సి.. ఈ వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరు త‌ప్పయితే.. ఆయ‌నే ఆత్మ విచారం చేసుకుని.. ప‌రిస్థితిని చ‌క్క‌దిద్దాలి. లేక‌పోతే.. వైఎస్ కుటుంబానికి మిగిలి ఉన్న పెద్ద‌నాయ‌కుడిగా.. పెట్ట కుటుంబ స‌భ్యుడిగా ఆయ‌నే న‌వ్వుల పాల‌వుతారు. ఇదే స‌మ‌యంలో వైఎస్ పేరుతో ఆయ‌న చేస్తున్న రాజ‌కీయం, వ్యాపారాలు కూడా అనుమానపు చ‌ట్రంలో బంధీల‌వుతాయి.

ష‌ర్మిల ఆవేద‌న‌, ఆక్రోశంలో అర్థం ప‌ర‌మార్థం సంగ‌తి ఎలా ఉన్నా..జ‌గ‌న్ అనుస‌రిస్తున్న తీరు ఇప్పుడు చ‌ర్చ‌గా మారింది. వాస్త‌వాలు ఎలా ఉన్నా.. సోద‌రిని సంతృప్తి ప‌ర‌చ‌డ‌మే ఇప్పుడు జ‌గ‌న్ ముందున్న ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యంగా భావించాల్సిన అవ‌స‌రం ఉంది.