మ‌ధ్య‌వ‌ర్తులుగా చాలానే చేశాం.. సాయిరెడ్డి

మీడియా మీటింగ్ పెట్టి.. మీడియాపైనే రుస‌రుస‌లాడిన ఘ‌న‌త వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్య‌స‌భ స‌భ్యుడు సాయిరెడ్డికే ద‌క్కుతుంది. తాజాగా ఆయ‌న హైద‌రాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్ల‌బ్‌లో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా 62 నిమిషాల పాటు ఆయ‌న పాత సంగ‌తులు త‌వ్వి తీశారు. వైఎస్ ఎంత ఆస్తులు పంచారు. అసలు వైఎస్ ఫ్యామిలీ ఏయే ఆస్తులు పంచుకుంది.. అని మొద‌లు పెట్టి.. అనేక విష‌యాలు చెప్పుకొచ్చారు.

అనంతరం.. మీడియాను కూడా ప్ర‌శ్నించ‌మ‌ని కోరారు. ఈ క్ర‌మంలో అస‌లు ష‌ర్మిల‌తో వివాదం ప్రారంభమైన‌ప్పుడు మీరు(సాయిరెడ్డి- సుబ్బారెడ్డి) మ‌ధ్య‌వ‌ర్తులుగా ఏమీ చేయ‌లేదా? అన్న ప్ర‌శ్న వ‌చ్చింది. దీనికి సాయిరెడ్డి చాలానే చేశాం.. అనేక చ‌ర్చ‌లు కూడా జ‌రిపాం.. అన్నారు. అయితే.. ఆ చ‌ర్చ‌ల సారాంశం ఏంటి? ఎందుకు ఇలా జ‌రిగింద‌న్న ప్ర‌శ్న వెంట‌నే తెర‌మీదికి వ‌చ్చింది. దీనికి మాత్రం సాయిరెడ్డి రుస‌రుస‌లాడారు.

కొన్ని క్ష‌ణాలు మౌనంగా ఉండి.. మీరైనా.. నేనైనా లిమిట్ క్రాస్ చేయ‌కూడ‌దు! అంటూ.. మీడియా ప్ర‌తినిధి పై విమ‌ర్శ‌లు గుప్పించారు. అంతేకాదు.. మీరు అడుగుతున్న‌ది లిమిట్ క్రాస్ చేసిన‌ట్టుగానే ఉంద‌న్నారు. ఒకానొక క్ష‌ణంలో సాయిరెడ్డి మొహంలో ఏదో దాస్తున్నారన్న అనుమానం క‌లిగించేలా ఫీలింగ్ రావ‌డం విశేషం. ఇక‌, ఏది అడిగినా.. ఆయన చిరాకుగా వ్య‌వ‌హ‌రించ‌డం.. త‌ప్పించుకునే ధోర‌ణి కూడా క‌నిపించింది. మ‌రోవైపు.. అడిగిన ఒక‌టి రెండు ప్ర‌శ్న‌ల‌కు కూడా ఆయ‌న చంద్ర‌బాబు చుట్టూ తిప్పారు.

దీంతో మిగిలిన మీడియా ప్ర‌తినిధులు మౌనంగా ఉండిపోయారు. తాను చెప్పాల‌ని అనుకున్న‌ది చెప్పిన సాయిరెడ్డి .. ఇవే ప్ర‌శ్న‌లు ష‌ర్మిల‌ను ఎందుకు అడ‌గలేద‌ని ఎదురు ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు .. ఏదైనా ఉంటే ష‌ర్మిల‌నే ప్ర‌శ్నించాల‌ని కూడా చెప్పుకొచ్చారు. మొత్తంగా సాయిరెడ్డి ఒక‌ర‌కంగా .. మీడియా ప్ర‌తినిధుల‌ను త‌న హావ భావాల ద్వారా.. ప్ర‌శ్నించ‌కుండా చేశార‌నే చెప్పాలి.