ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు కూడా స్పందించారు. తన తల్లి, చెల్లితో వివాదాన్ని టిడిపికి జగన్ అంటగడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అయినా, షర్మిలకు ఆస్తి ఇవ్వాలంటే అవినాష్ రెడ్డిని విమర్శించకూడదని కండిషన్ పెట్టడం ఏంటో అని చంద్రబాబు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు.
జగన్ కుటుంబ వ్యవహారంపై వాస్తవాలు పట్టించుకోకుండా ఎల్లో మీడియా, కూటమి నేతలు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరుగుతుంటే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ మొదలుబెట్టారని విమర్శించారు. మూడు రోజులుగా టీడీపీ అఫీషియల్ ఎక్స్ ఖాతాతో పాటుగా ఎల్లో మీడియా జగన్ పై విమర్శలు చేస్తున్నాయని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి ట్రోలింగ్ చేస్తున్నారని నాని అన్నారు.
వైఎస్ మరణం కంటే ముందే జగన్, షర్మిలలకు ఆస్తి పంచారని, కానీ, వ్యాపారాల్లో వచ్చే ఆదాయంతో జగన్ మరిన్ని కంపెనీలు స్థాపించారని నాని అన్నారు. తండ్రి చనిపోయిన తర్వాత, షర్మిల పెళ్లయిన ఇన్నేళ్లకు కూడా ఏ అన్న అయినా ఆస్తులు పంచుతారా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏనాడైనా ఆయన తమ్ముడు నారా రామ్మూర్తి నాయుడుకు, ఆస్తి ఇచ్చారా అని ప్రశ్నించారు. కనీసం తన తోబుట్టువులకు చంద్రబాబు పసుపు కుంకుమ పెట్టారా అని ప్రశ్నించారు. కానీ భారతీ సిమెంట్ లో షర్మిలకు జగన్ 40 శాతం రాసిచ్చారని గుర్తు చేశారు.
అయితే, జగన్ పై ఈడీ కేసులు పూర్తవుగానే షర్మిలకు ఇచ్చే లాగా అగ్రిమెంట్ రాసుకున్నారని గుర్తు చేశారు . కేసులు తేలేవరకు ఆ ఆస్తులను కదిలించవద్దన్న హైకోర్టు ఆదేశాలను షర్మిల ఎందుకు ఖాతరు చేయడం లేదని ప్రశ్నించారు. టిడిపి వంటి దిక్కుమాలిన, దౌర్భాగ్య పార్టీతో చంద్రబాబు వంటి వ్యక్తితో రాజకీయం చేయడం జగన్ ఖర్మ అని చురకలంటించారు. జగన్ ఇంట్లో ఆస్తులు సమస్యతో రాష్ట్రానికి ఏమి ఇబ్బంది అని, అసలు ఈ విషయంపై చంద్రబాబు ఎందుకు అంత పులకరించిపోతున్నారని ఎద్దేవా చేశారు. పక్కింట్లో గొడవలపై చంద్రబాబు ఎందుకు సంబరపడుతున్నారని నాని చురకలంటించారు.
ఈడీ కేసుల్లో జగన్ కు బెయిల్ రద్దు కావడం కోసమే శత్రువులతో షర్మిల చేతులు కలిపి పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరుగుతుంటే షర్మిల ఎందుకు నోరు మెదపడం లేదని నాని ప్రశ్నించారు. అధికారంలో లేని జగన్ పై ఎందుకు విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. షర్మిల వంటి చెల్లెలు ఉంటే ఏ అన్నకైనా సమస్యలు తప్పవని అన్నారు. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలో ఉందని …వివేక హత్య కేసును ఇంకా ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.