వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలల మధ్య ఆస్తి వివాదం ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అన్నాచెల్లెళ్లు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. తమ కుటుంబ వివాదాన్ని రాజకీయం చేస్తున్నారని టీడీపీపై జగన్ చేసిన విమర్శలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు.
తన తల్లి, చెల్లితో గొడవ అయితే మధ్యలో టిడిపిని జగన్ ఎందుకు లాగుతున్నారని జగన్ పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి సంపాదించిన ఆస్తిలో వాటా ఆయన భార్యకు రాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు జగన్ కు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన నిలదీశారు. జగన్ వంటి వ్యక్తితో రాజకీయం చేయడానికి సిగ్గుగా ఉందని చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. జగన్ చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారని, ఇకపై అయినా మానుకోవాలని చంద్రబాబు హితవు పలికారు.
విలువలు లేని జగన్ వంటి వ్యక్తులతో సమాజానికి చెడు జరుగుతుందని చంద్రబాబు అన్నారు. తనను ఇంట్లో నుంచి ఐదేళ్లు పాటు బయటకు రానివ్వలేదని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు తాను జగన్ ను ఆపాలంటే నిమిషం పట్టదని చంద్రబాబు హెచ్చరించారు. 2004లో వందల కోట్లుగా ఉన్న సంపాదన ప్రస్తుతం లక్షల కోట్లకు ఎలా చేరుతుందని చంద్రబాబు ప్రశ్నించారు. ఆ డబ్బంతా ఎలా సంపాదించారో చెప్పాలని జగన్ ను చంద్రబాబు నిలదీశారు.
ప్రభుత్వంలో ఉండగా పేదలకు ఏనాడు సహాయం చేయని జగన్ ఇప్పుడు వైసీపీ తరఫున ఓ బాధితురాలి కుటుంబానికి 10 లక్షలు అంటూ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. జగన్ దగ్గర అవినీతి సొమ్ము ఆ రకంగా అయినా పేదలకు చేరుతుందని చంద్రబాబు అన్నారు. విలువలు లేని రాజకీయం చేయాలనుకుంటే ఇకపై కుదరదాన్ని చంద్రబాబు హెచ్చరించారు.