ఏమైనా చంద్రబాబు లెక్కనే వేరుగా ఉంటుంది. డెబ్భై ఏళ్ల వయసులోనూ తరగని ఉత్సాహం.. రాష్ట్రానికి ఏదో చేద్దామన్న తపన ఆయనలో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రాలకు భిన్నంగా.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆలోచనలకు ఏ మాత్రం పోలిక లేని స్థాయిలో ఆయన విజన్ ఉంటుంది. ఐటీ గురించి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దగా మాట్లాడుకోని వేళలో.. హైదరాబాద్ కు ఐటీ కంపెనీలను తెచ్చేందుకు తపించిన ఆయన ఆలోచనలు ఫలించటమే కాదు.. ఈ రోజున దేశంలో హైదరాబాద్ మహానగరం వైపే అందరి చూపు ఉండటం తెలిసిందే.
దేశంలో ఐటీకి హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మారింది. నిజమే బెంగళూరు ఉన్నప్పటికీ.. కొంతకాలంగా బెంగళూరు కంటే హైదరాబాద్ వైపే ఆసక్తి చూపుతున్న వైనం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఏపీకి ముఖ్యమంత్రిగా మారిన చంద్రబాబు తన తొలి ఐదేళ్లలో రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దే ప్రయత్నంతో పాటు.. ఐటీ సంస్థల్ని ఆకర్షించే ప్రయత్నం చేశారు.
కానీ.. అదేమీ అంత తేలికైన విషయం కాదన్నది ఆయనకు అర్థమైనట్లుగా కనిపిస్తోంది. అందుకేనేమో.. ఇటీవల ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ఆయన ఆలోచనల్లో మార్పులు వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఐటీని ఎంత ఫుష్ చేసినా ఏపీకి వచ్చే అవకాశం లేకపోవటంతో.. మరో కొత్త రంగం మీద ఆయన ఫోకస్ చేయటం.. అందులో భాగంగా ఆయన డ్రోన్ వ్యవస్థను ఎంచుకోవటం కనిపిస్తుంది. తాజాగా విజయవాడలో నిర్వహించిన అంతర్జాతీయ డ్రోన్ సదస్సుతో చంద్రబాబు తాజా చూపు డ్రోన్ టెక్నాలజీ మీద పడినట్లుగా అర్థమవుతుంది. అంతేకాదు.. ఏపీని డ్రోన్ హబ్ గా మార్చాలన్న ఆలోచన ఉన్నట్లు అర్థమవుతుంది.
ఈ సదస్సులో డ్రోన్ల సాయంతో ఏయే రంగాలకు ఎలాంటి సేవల్ని అందించవచ్చో అక్కడ ప్రదర్శించటం ద్వారా.. డ్రోన్లకు ఉన్నమార్కెట్.. దాని ఫ్యూచర్ ఏమిటన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐటీని అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేసే కన్నా.. ఎవరూ ఫోకస్ చేయని డ్రోన్ల మీద ఎక్కువ దృష్టి పెడితే ఫలితం ఉంటుందన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు.
మొన్నీ మధ్యన విజయవాడను ముంచెత్తిన వరదల వేళలో డ్రోన్లతో బాధితులకు సహాయకచర్యల్ని చేపట్టటం తెలిసిందే. అంతేకాదు.. ఇప్పుడు యుద్ధాలు కూడా డ్రోన్లతో చేస్తున్న వైనం చూస్తున్నాం. ఇలా చూస్తే.. రానున్నరోజుల్లో డ్రోన్లు కీలక భూమిక పోషించే వీలుంది. ఇలాంటి వేళలో.. డ్రోన్ టెక్నాలజీకి.. ఉత్పత్తికి ఏపీని హబ్ గా ఏర్పాటు చేస్తే రాష్ట్ర ఇమేజ్ మరో స్థాయికి వెళ్లటం ఖాయం. ఇదంతా చూస్తున్నప్పుడు చంద్రబాబు ట్రెండ్ సెట్టర్ అన్న విషయంలో ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదన్న విషయం అర్థమవుతుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates