గుంటూరు వైసీపీ సైలెంట్‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ నివాసం ఉండే జిల్లా గుంటూరు. అలాంటి జిల్లాలో పార్టీ ప‌రుగులు పెట్టాలి. నాయ‌కులు క‌లివిడిగా ఉండాలి. అయితే.. ఆ ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. గుంటూరులో ఒక‌ప్పుడు ఉన్న జోష్ ఇప్పుడు వైసీపీలో క‌నిపించ‌డ‌మే లేద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. మ‌రి దీనికి కార‌ణం ఏంటి? ఎందుకు? అనేది ఆస‌క్తిగా మారింది. 2019 ఎన్నిక‌ల్లో విజృంభించిన వైసీపీ తాజా ఎన్నిక‌ల్లో చ‌తికిల ప‌డింది. అయినా.. త‌గుదున‌మ్మా.. అంటూ మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు త‌రచుగా మీడియా ముందుకు వ‌స్తున్నారు. అయితే.. ఆయ‌న హైలెట్ కాలేకపోతున్నారు.

ఇక‌, వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు మీడియా ముందుకు వ‌చ్చిన నాయ‌కులు ఎన్నిక‌ల త‌ర్వాత ఎవ‌రికీ క‌నిపించ‌డం లేదు. దీనికి ప్ర‌ధానంగా రెండు కార‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. 1) పార్టీ అదినేత పై అసంతృప్తి. 2) కూట‌మి స‌ర్కారు దూకుడుతో న‌మోద‌వుతున్న కేసులు.. వెలికి తీస్తున్న పాత సంగ‌తులు. దీంతో ఉమ్మ‌డి గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నాయ‌కులు మీడియా ముందుకు కూడా వ‌చ్చేందుకు సాహ‌సం చేయ‌డం లేదు. మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరెస్టు బెయిల్ త‌ర్వాత‌.. నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న క‌నిపించ‌డం లేదు.

ఇక‌, బాప‌ట్ల మాజీ ఎంపీ.. నందిగం సురేష్ అరెస్టు.. జైలు.. ప‌లు కేసుల్లో కొన‌సాగుతూనే ఉన్నాయి. ఇంకా ఇంకా ఆయ‌న‌పై కేసులు పెరుగుతున్నాయే త‌ప్ప త‌ర‌గ‌డం లేదు. ఇక‌, గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన కిలారి రోశ‌య్య ఇటీవ‌ల పార్టీ మారిపోయారు. దీంతో ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ జెండాలు మోసేవారుక‌నిపించ‌డం లేదు. తెనాలి మాజీ ఎమ్మెల్యే అన్నాబ‌త్తుని శివ‌కుమార్‌. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఓ వ్య‌క్తిపై చేయి చేసుకున్న ఘ‌ట‌న‌కు సంబంధించిన కేసు న‌డుస్తోంది. దీంతో ఆయ‌న కూడా బ‌య‌ట‌కురావ‌డం లేదు.

మంగ‌ళ‌గిరిలో కీల‌క‌మైన నాయ‌కుడు ఆళ్ల రామ‌కృష్నారెడ్డి ఎన్నిక‌ల త‌ర్వాత అస‌లు ఎక్క‌డున్నారో కూడా తెలియ‌డం లేదు. ఇక్క‌డ నుంచి పోటీ చేసి నారా లోకేష్ చేతిలో ప‌రాజ‌యం పాలైన మురుగుడు లావ‌ణ్య‌ను ఇటీవ‌ల ఇంచార్జ్ ప‌ద‌వి నుంచి త‌ప్పించారు. దీంతో ఆమె కూడా మౌనంగా ఉన్నారు. ఇక‌, టీడీపీ పాత నేత గంజి చిరంజీవి.. తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీంతో ఆయ‌న ప‌రిస్థితి కూడా వైసీపీకి దూరంగానే ఉన్న‌ట్ట‌యింది. తాడికొండ‌లో టికెట్ తీసుకుని పోటీ చేసి ఓడిపోయిన మాజీ హోం మంత్రి మేక‌తోటి సుచ‌రిత.. తిరిగి త‌న పాత నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌త్తిపాడును అప్ప‌గించాల‌ని గోల చేస్తున్నారు. ఇలా.. ఒక్కొక్క నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్కొక్క విధంగా వైసీపీ గ‌డ్డి ప‌రిస్థితిని ఎదుర్కొంది. ఫ‌లితంగా గుంటూరు వైసీపీలో సైలెంట్ కొన‌సాగుతోంది.