వైసీపీ నాయకుడు, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్..ఇప్పట్లో జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. టీడీపీ ఆఫీసుపై 2021లో జరిగిన దాడి నేపథ్యంలో నమోదైన కేసులో ఆయన తొలుత అరెస్టు అయ్యారు. 14 రోజుల పాటు గుంటూరు జిల్లా జైల్లో ఉన్నారు. ఈ క్రమంలోనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. బెయిల్ వచ్చింది. కానీ, ఇంతలోనే.. అమరావతిలోని వెంకట పాలెంలో ఉన్న ఎస్సీ కాలనీలో మరియమ్మ అనే మహిళ హత్య కేసులో ఈయన పాత్ర ఉందని తేల్చారు.
దీంతో నందిగంపై మరియమ్మ హత్య కేసు నమోదై.. ఆ వెంటనే మరో 14 రోజుల పాటు ఈ కేసులో రిమాండ్ విధించారు. ఫలితంగా నందిగం ఇప్పటి వరకు బయటకురాలేదు. పైగా రెండు రోజుల పోలీసు కస్టడీ లో విచారణకు కూడా హాజరయ్యారు. ఇక, మరియమ్మ కేసులో బెయిల్ కోసం ప్రయత్నిస్తున్న సమయం లో తాజాగా మరో సంచలన కేసు నమోదైంది. అదే.. బీజేపీ సీనియర్ నాయకుడు, ప్రస్తుత మంత్రి సత్యకుమార్ యాదవ్‌పై 2021-22 మధ్య జరిగిన హత్యా యత్నం.
దీనిని ఇప్పుడు బీజేపీ నాయకులు తిరగదోడారు. ధర్మవరం నియోజకవర్గంలో సత్యకుమార్ యాదవ్ పర్యటించిన సమయంలో ఆయనపై ఓ వ్యక్తి హత్యాయత్నం చేశారన్నది.. బీజేపీ నేతలు చేసిన ఫిర్యాదు. దీని వెనుక మాస్టర్ మైండ్ అంతా.. నందిగం సురేష్‌దేనని ఆరోపిస్తున్నారు. దీనిపై గుంటూరు పోలీసుల కు బీజేపీ నాయకులు కొన్నాళ్ల కిందటే ఫిర్యాదు చేయగా.. అంతర్గత విచారణలో దీనిపై నందిగం పాత్ర ను పోలీసులు కూపీలాగినట్టు సమాచారం.
ఈ క్రమంలో బీజేపీ నేత సత్యకుమార్‌పై హత్యాయత్నం కేసు వెనుక నందిగం పాత్ర ఉందని నిర్ధారించు కున్నారు. దీంతో ఆయన పై కేసు నమోదు చేసినట్టు తెలిసింది. ఫలితంగా నందిగం.. మరో కేసులో ఇరు క్కున్నట్టు అయింది. దీనిపై అధికారికంగా పోలీసులు ప్రకటన చేయాల్సి ఉంది. మరోవైపు.. గతంలో టీడీపీ నాయకుడు, ప్రస్తుత ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై దాడి చేసిన కేసులోనూ నందిగంపై రెండు రోజుల కిందట కేసు నమోదైన విషయం తెలిసిందే.