వైసీపీ నుంచి నాయకులు బయటకు వస్తున్న విషయం తెలిసిందే. సాధారణం నుంచి కీలకనాయకుల వరకు కూడా చాలా మంది క్యూకట్టుకుని మరీ బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో .. కీలక నేత, కృష్ణాజిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ నాయకుడు జోగి రమేష్ కూడా చేరిపోతున్నట్టు తెలిసింది. తాజాగా జోగి అనుచరులకు చెందిన సోషల్ మీడియాలో ‘మా అన్న మారుతున్నాడహో!’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. “ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న పార్టీలోకి మా అన్నమారుతున్నాడు” అని జోగి అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
దీంతో జోగి రమేష్.. కుటుంబ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కాంగ్రెస్తో రాజకీయాలు ప్రారంభించిన జోగి.. వైసీపీ హయాంలో మంత్రి అయ్యారు. అయితే.. దీనికి ముందు ఆయన చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతోపాటు.. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక, ఇప్పుడు ఆ కేసు విచారణ పుంజుకుంది.
మరోవైపు.. జోగి కుమారుడు.. జోగి రాజీవ్.. అగ్రిగోల్డ్ భూముల కేసులో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన కొన్నాళ్లు జైల్లో ఉండడం.. ఇటీవల బయటకు రావడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనూహ్యంగా జోగి రమేష్ యూటర్న్ తీసుకోవడం.. వైసీపీకి గుడ్ బై చెబుతున్నారన్న సమాచారం బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వైసీపీకి, ముఖ్యంగా జగన్కు నమ్మిన బంటుగా ఉన్న జోగి రమేష్.. జగన్ ఎంత చెబితే అంత అన్నట్టుగా వ్యవహరిస్తానని చెప్పుకొచ్చారు.
కేసులు నమోదైనప్పుడు కూడా.. జోగి పార్టీని, జగన్ను కూడా వెనుకేసుకు వచ్చారు. అయితే, ఆయా కేసుల్లో తీవ్రత పెరుగుతుండడం.. చంద్రబాబు నివాసంపై దాడి కేసులో జోగిని అరెస్టు చేసే అవకాశం ఉందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో పార్టీ మార్పు దిశగా జోగి ఆలోచన చేస్తున్నట్టు ప్రచారం జరగడం సంచలనంగా మారింది. పార్టీ మారాల్సి వస్తే.. జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. అంతేకాదు.. తాను గతంలో చేసిన అన్ని పనులను వైసీపీ పెద్దలు చెబితేనే చేశానని చెప్పుకొనే అవకాశం కూడా కనిపిస్తుండడం గమనార్హం.