“ప్రశ్నించే స్వరాలను చంద్రబాబు అణిచేస్తున్నారు”- ఇదీ.. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చేసిన కామెంట్. అయితే.. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ అవుతోంది. దీనికికారణం.. అసలు ప్రశ్నించే స్వరాలను అణిచి వేసింది వైసీపీ హయాంలోనేనని అంటున్నారు నెటిజన్లు. 2023 జనవరిలో తొలి వారంలోనే ప్రబుత్వం ‘జీవో నెంబర్-1’ తీసుకువచ్చింది. దీనిపై పెద్ద ఎత్తున రచ్చ కూడా సాగింది. ఎందుకంటే.. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిపై దేశద్రోహం కేసు పెట్టాలని జీవోలో పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టు విచారణలో సర్కారును ఉతికి ఆరేసింది. ఇక, విధిలేని పరిస్థితిలో ఈ జీవోను వెనక్కి తీసుకున్నారు. అప్పట్లోనే నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. సరిగ్గా దానికి వారం ముందు ఈ జీవోను తీసుకువచ్చారు. అయితే.. దీనిని రద్దు చేయడంతో సరిపోయింది. కట్ చేస్తే.. ప్రశ్నించే స్వరాలను అణిచేయడంలో వైసీపీ రికార్డు చాలా భిన్నంగా ఉంది. రంగనాయకమ్మ అనే 76 ఏళ్ల వృద్ధురాలు.. అమరావతికి చెందిన సోషల్ యాక్టివిస్టు.. ఓ పోస్టును ఫార్వర్డ్ చేశారని కేసు నమోదు చేశారు.
అర్ధరాత్రి పూట ఆమెను ప్రశ్నించేందుకు సీఐడీ అధికారులు అమరావతికి వెళ్లడం.. రాత్రివేళలో ఆమెను ప్రశ్నించడం తెలిసిందే. ఇక, “ఎన్-95 మాస్కులు ఎందుకు ఇవ్వరు? కరోనా తో మా ప్రాణాలకు కూడా భయం ఉంది” అంటూ.. విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ ‘ప్రశ్నిస్తే’ చివరకు ఏమైంది? నడిరోడ్డుపై పోలీసులు పెడరెక్కలు విరిచి కట్టి.. తరలించారు. తర్వాత.. ఆయన మానసికంగా కుంగిపోయేలా చేశారు. కథ ఇక్కడితోనూ అయిపోలేదు.
సొంత ఎంపీ రఘురామకృష్ణరాజును.. ప్రశ్నించారన్న కారణంగానే కదా.. ‘ట్రీట్‌మెంట్’ ఇప్పించారు. గుంటూరుకు చెందిన ఈనాడు మాజీ రిపోర్టును ప్రశ్నించినందుకే.. కదా..అర్ధరాత్రి అరెస్టు చేశారు. “కుండబద్దలు” నినాదంతో యూట్యూబ్ నడిపిన ఓ జర్నలిస్టును కూడా అదిరించి బెదిరించడానికి కారణం.. ప్రశ్నించడం వల్లే కదా! సో.. ఇవన్నీ మరిచిపోయి.. ఇప్పుడు.. జగన్ చంద్రబాబుపై విమర్శలు చేయడాన్ని నెటిజన్లు ‘జోక్’గా పేర్కొంటున్నారు.
తాను చేసింది నాలుగు మాసాల్లో నే మరిచిపోయారా? అన్నది ప్రశ్న. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి.. జగన్‌కు ఇలా ఎందుకు అనిపించిందంటే.. తాజాగా వైసీపీ నాయకుడు… బోరుగడ్డ అనిల్‌ను పోలీసులు అరెస్టు చేయడమే. ఈయన సోషల్ మీడియాలో ప్రశ్నించడమే పని అని అనుకుని బూతులతో రెచ్చిపోయిన విధానం.. ఆయన మీడియాను ఫాలో అయిన వారికి తెలుస్తుంది. మొత్తంగా.. జగన్ “ప్రశ్నించడాన్ని” ప్రశ్నించడం.. జోకేనని మెజారిటీ నెటిజన్లు అంటున్నారు.