ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ పథకాలలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించిన పథకం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం. అయితే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి అయిన తర్వాత కూడా ఆ పథకం ఏపీలో అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలోనే వైసిపితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వ్యవహారంపై విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ విషయంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వినూత్న నిరసన తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు సీఎం చంద్రబాబుకు పోస్ట్ కార్డులు రాసి నిరసన తెలపాలని ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు షర్మిల పిలుపునిచ్చారు. ఈ రోజు విజయవాడ నుంచి తెనాలి వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన షర్మిల కండక్టర్ దగ్గర నుంచి టికెట్ కొని తన నిరసనను వ్యక్తం చేశారు. అంతేకాకుండా, బస్సులోని మహిళలందరూ తమకున్న టికెట్లను చూపించాలని తోటి మహిళా ప్రయాణికులను షర్మిల కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
విజయవాడ నుంచి తెనాలి వరకు షర్మిల ప్రయాణించిన సందర్భంగా బస్సులోని మహిళా ప్రయాణికులతో మాట్లాడిన షర్మిల ఉచిత బస్సు ప్రయాణంపై వారి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. బస్సులో తోటి మహిళలతో కలిసి మహిళలకు ఉచిత బస్సు పథకం హామీని అమలు చేయాలని షర్మిల నినాదాలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా ఆ పథకాన్ని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు.
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం వారం రోజుల లోపు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసిందని చెప్పారు. కర్ణాటకలో కూడా ఆ పథకం అమలు చేస్తున్నారని కానీ, ఏపీలో మాత్రం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఉచిత బస్సు వాగ్దానం అని చెప్పి మహిళలతో ఓటు వేయించుకున్నారని, కానీ ఎన్నాళ్ళైనా ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఆ పథకం అమలు చేయకపోవడానికి ఉన్న ఇబ్బందులు ఏంటి అని ప్రశ్నించారు.
నెలకు సగటున 30 లక్షల మంది ప్రయాణికులలో 20 లక్షల మంది మహిళలున్నారని షర్మిల అన్నారు. మహిళలతో ఓట్లు వేయించుకుని నెలకు మహిళల కోసం 300 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టలేరా అని ప్రశ్నించారు. మహిళలపై చంద్రబాబు ప్రభుత్వానికి ఉన్న శ్రద్ధ ఇది అని విమర్శించారు. తాను ప్రయాణించిన బస్సులో మహిళలందరితో కలిసి పోస్ట్ కార్డును చూపిస్తు షర్మిల నిరసన వ్యక్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో నేడు, రేపు, ఎల్లుండి పోస్ట్ కార్డు ద్వారా చంద్రబాబుకు నిరసన తెలపాలని పిలుపునిచ్చారు. వేలాది పోస్ట్ కార్డులు చంద్రబాబుకు పంపించాలని షర్మిల, అవి చూసిన తర్వాత అయినా చంద్రబాబు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తారేమో అని అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates