ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్ విషయంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ సంచలన మార్పు చేశారు. గతంలో ఉన్నట్టుగానే వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికే ఇప్పుడు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. రెండేళ్లకుపైగానే సాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇంచార్జ్‌గా ఉన్నారు. ఈయన హయాంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరిగా యి. విశాఖపట్నంలో పార్టీ పాగా కూడా వేసింది.
అయితే.. ఎన్నికలకు ఏడాది ముందు అనూహ్య కారణాలతో సాయిరెడ్డిని తప్పించారు. ఈ క్రమంలోనే వైవీసుబ్బారెడ్డికి పగ్గాలు అప్పగించారు. కానీ, అంతర్గత కుమ్ములాటలు అప్పుడే ప్రారంభమయ్యాయి. ధర్మాన ప్రసాదరావు వంటివారు వైవీతో విభేదించడం.. నువ్వు చెప్పేదేంటంటూ.. మొహం మీదే ప్రశ్నించడం తెలిసిందే. ఇలా.. మొత్తంగా వైవీ వల్ల ఉత్తరాంధ్రలో వైసీపీ బలపడకపోగా.. మరింత ఇబ్బందులు ఎదుర్కొంది. మొత్తంగా భారీ ఎదురు దెబ్బ తగిలింది.
తాజాగా ఇప్పుడు పార్టీ ప్రక్షాళనలో భాగంగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నాలుగు నెలలకు పార్టీలో మార్పులు చేర్పులు చేపట్టారు. ఇప్పటికే పలు జిల్లాల్లో అధ్యక్షులను మార్చిన పార్టీ అధినేత.. ఇప్పుడు కోఆర్టినేటర్లను మార్చారు. పార్టీలో తలపండిన సీనియర్లకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఇలా.. విజయసాయి రెడ్డికి మళ్లీ ఉత్తరాంధ్ర బాధ్యతలు అప్పగించారు.
అయితే.. ఈ బాధ్యతల్లోనూ కొంత మేరకు కోత పెట్టినట్టు తెలుస్తోంది. మూడు జిల్లాలు ఉన్న ఉత్తరాంధ్ర లో సాయిరెడ్డికి కేవలం రెండు జిల్లాలు మాత్రమే అప్పగించారు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం జిల్లా బాధ్యతలు మాత్రమే విజయసాయిరెడ్డికి ఇచ్చారు. దీంతో విజయనగరం బాధ్యతలు ఎవరికి అప్పగించనున్నారనేది ఆసక్తిగా మారింది. ఇక, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి అప్పగించారు. వీరు ప్రతి నెలా రిపోర్టు ఇవ్వాలని.. పార్టీని గాడిలో పెట్టాలని జగన్ ఆదేశించడం గమనార్హం. మరి ఈ మార్పుతో వైసీపీ ఏమేరకు పుంజుకుంటుందనేది చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates