రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లకు పైనే అవుతున్నా.. నందమూరి బాలక్రిష్ణకు ఇబ్బంది పడేలాంటి పరిణామం పెద్దగా ఎదురుకాలేదనే చెప్పాలి. నిజానికి తన స్థాయికి తగ్గట్లు పదవులు పొందే వీలున్నా.. అలాంటి వాటి జోలికి వెళ్లకుండా పరిమితమైన పాత్రను పోషిస్తున్నారనే చెప్పాలి.
సినీ నటుడిగా బిజీగా ఉండే ఆయన రాజకీయాల్లో తనదైన మార్కును చూపించలేరన్న మాటకు భిన్నంగా ముచ్చటగా మూడుసార్లు గెలవటం ద్వారా.. తన అధిక్యతను ప్రదర్శించారు. అయినప్పటికీ మంత్రి పదవి కోసం ఆశపడకుండా ఉండటం ఆసక్తికర అంశంగా చెప్పాలి.
గతంలో ఎప్పుడూ లేని విధంగా తాజాగా ఆయన సమర్థతకు.. రాజకీయ చతురతకు అగ్నిపరీక్షగా హిందూపురం మున్సిపల్ ఛైర్మన్ వ్యవహారం మారిందంటున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మిగిలిన తెలుగు తమ్ముళ్ల మాదిరే మున్సిపాలిటీని కోల్పోవాల్సి వచ్చింది.
అయితే.. ఇటీవల అధికార మార్పిడి నేపథ్యంలో హిందూపురం మున్సిపాలిటీలో కొత్త రాజకీయం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో హిందూపురంలోని 38 మంది కౌన్సిలర్లకు 30 సీట్లను నాటి అధికార వైసీపీ గెలుచుకుంది.
ఆ విజయం మీద బోలెడన్ని విమర్శలు.. ఆరోపణలు ఉన్నాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే.. ఆ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఆరు వార్డుల్నే గెలుచుకుంది. అయితే.. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నేత్రత్వంలోని కూటమి చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుందో.. హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఇంద్రజతో పాటు 11 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. పార్టీ మారిన ఛైర్ పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేశారు.
మొదట్నించి ఉన్న ఆరుగురు టీడీపీ కౌన్సిలర్లకు వైసీపీకి చెందిన 11 మంది జత చేరటంతోబలం 17కు చేరింది. హిందూపురం ఎంపీ.. ఎమ్మెల్యేలతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా ఉన్న నేపథ్యంలో టీడీపీకి ఛైర్ పర్సన్ పదవిని సొంతం చేసుకుంటుందన్న వాదనలు వినిపించాయి. అయితే.. అనూహ్యంగా వైసీపీ అధినేత జగన్ తిప్పిన చక్రంతో ఛైర్ పర్సన్ గా వ్యవహరించి రాజీనామా చేసిన ఇంద్రజతో పాటు.. ఆమెతో వచ్చిన మరో నలుగురు కౌన్సిలర్లను వెనక్కి రప్పించుకుంది. వారిని జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లి.. భేటీ అయ్యేలా చేశారు.
ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి ఆశనిపాతంగా మారింది. పార్టీలోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ వైసీపీ గూటికి చేరటం హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా బాలక్రిష్ణ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తాయి. పార్టీ మారిన వారిని తమ వద్ద ఉండేలా చేసుకోవటంలో ఆయన ఫెయిల్ అయ్యారని.. దీనికి కారణం ఆయనే అన్న మాట బలంగా వినిపిస్తోంది. పార్టీ మారి వచ్చిన వారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వకపోవటం.. మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికకు సంబంధించిన అధికారిక ప్రకటన ఆలస్యం కావటం కూడా తాజా పరిణామానికి కారణంగా చెబుతున్నారు.
కాస్త ఆలస్యంగా తనకు జరిగిన డ్యామేజ్ ను గుర్తించిన బాలక్రిష్ణ.. ఇప్పుడు హిందూపురం మీద ఫోకస్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధినేత జగన్ తీసుకున్న ఒక నిర్ణయం సంచలనంగా మారింది. మున్సిపల్ ఛైర్ పర్సన్ పదవికి పోటీగా కౌన్సిలర్ లక్ష్మిని బరిలోకి దించేందుకు జగన్ ఓకే చెప్పారు. పార్టీకి చెందిన పలువురికి లక్ష్మి అభ్యర్థిత్వం ఇష్టం లేదంటున్నారు. ఇలాంటి వేళ.. కాస్త ఆలస్యంగా స్పందించిన బాలయ్య.. మున్సిపల్ ఛైర్ పర్సన్ పోస్టును పార్టీకి దక్కేలా చేయటం కోసం సీన్లోకి వచ్చారని చెబుతున్నారు.
వైసీపీ ఎత్తులకు పైఎత్తులు వేసి తన సత్తా చాటాలని బాలయ్య పట్టుదలతో ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో.. హిందూపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికల అంశం ఇరు పార్టీలకుప్రతిష్ఠాత్మకంగా మారింది. వైసీపీ అధికారంలో లేదు కాబట్టి.. బాలక్రిష్ణ రాజకీయ సమర్థతకు ఇదో అగ్నిపరీక్షగా చెబుతున్నారు. అవసరమైతే రిసార్టు రాజకీయాలకు తెర తీయటం ద్వారా.. తమ అధిక్యతను ప్రదర్శించాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నట్లు తెలుస్తోంది. ఏమైనా హిందూపురం మున్సిపాల్టీపై పసుపు జెండా ఎగిరేలా చేయాలన్న బాలయ్య పట్టుదల ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.